City Police | సిటీబ్యూరో: పోలీస్‌స్టేషన్‌లో కేసుల పెండెన్సీ పెరిగిపోతున్నది. క్రైమ్ రివ్యూలు తగ్గిపోయాయి.. క్షేత్ర స్థాయిలో ఏం జరుగుతున్నది..వేగంగా పనులు ఎందుకు జరగడం లేదనే విషయంపై ఉన్నతస్థాయిలో ఎప్పటికప్పుడు పర్యవేక్షించే పరిస్థితులు కనిపించడం లేదు… ఇలా ఈ ఏడాది ట్రై పోలీస్ కమిషనరేట్లలో కేసుల పెండెన్సీ పెరిగిపోయింది. వీటన్నింటికీ తోడు కొందరు పోలీసులు స్టేషన్లో కంటే బందోబస్తుల పేరుతో రోడ్లపైనే ఎక్కువగా ఉండాల్సిన పరిస్థితి ఉంటున్నది.
కేసుల పెండెన్సీని తగ్గించేందుకు గత నెలలో హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్‌లో పని చేస్తున్న కొందరు ఇన్స్పెక్టర్ స్థాయి అధికారులను ఆయా ఠాణాలకు డీఐలుగా బాధ్యతలు అప్పగించడం గమనార్హం.. గత ఏడాది చివరిలో కాంగ్రెస్ అధికారం చేపట్టిన తరువాత అప్పటి వరకు పనిచేసిన ట్రై పోలీస్ కమిషనర్లు బదిలీ అయ్యారు. ఆ తరువాత ఎంపీ ఎన్నికల సందర్భంగా మరోసారి రాచకొండలో పోలీసు కమిషనర్ల బదిలీ, ఆ తరువాత మరో సారి బదిలీ కాగా.. అదే కోవలో హైదరాబాద్‌లో పోలీస్ కమిషనర్ మార్పు జరిగింది. ఉన్నతస్థాయిలో అధికారుల మార్పు చేర్పులతో కిందిస్థాయిలో పూర్తిగా పట్టు సడలిపోయిందనే వాదన వినిపించింది.
ఎప్పటికప్పుడు రివ్యూలతో..
రిసెప్షన్ స్టాఫ్, స్టేషన్ రైటర్, క్రైమ్ రైటర్, బ్లూ కోల్ట్స్, పెట్రోలింగ్ స్టాఫ్, కోర్టు మానిటరింగ్ సిస్టం, వారెంట్ స్టాఫ్, సమన్స్, టెక్నాలజీ టీమ్, ఇన్వెస్టిగేషన్ స్టాఫ్, క్రైమ్ స్టాఫ్, మెడికల్ సర్టిఫికెట్ స్టాఫ్, స్టేషన్ ఇన్చార్జీ, జనరల్ డ్యూటీ స్టాఫ్, డిటెక్టివ్ ఇన్స్పెక్టర్, స్టేషన్ హౌస్ ఆఫీసర్, అడ్మిన్ ఎస్సై ఇలా పోలీస్స్టేషన్లలోని ఆయా విభాగాలను 17గా విభజించి 17 వర్టికల్స్‌ను గత ప్రభుత్వ హయాంలో అందుబాటులోకి తెచ్చారు. కేసుల దర్యాప్తు వేగంగా జరుగుతూ వచ్చింది.
అయితే ఈ వ్యవస్థపై కొన్నాళ్లుగా ఉన్నతాధికారుల పర్యవేక్షణ లేదనే ఆరోపణలు వస్తున్నాయి. దీంతో అందరిని ఒకే గాటున అధికారులు చూస్తున్నారనే వాదన నడుస్తున్నది. అలాగే కొన్ని కేసుల్లో నిందితులను అరెస్టు చేయకుండా, ఈజీగా పరారీ అనే రాసేస్తున్నారని, దీంతోనే కేసుల పెండెన్సీలు పెరుగుతున్నదనే విమర్శలొస్తున్నాయి. తాజాగా ఒక రౌడీషీటర్‌ను సీసీఎస్ పోలీసులు అరెస్టు చేశారు. ఇతనిపై ఈ ఏడాది 9 కేసులు నమోదయ్యాయి. స్థానిక పోలీసులు ఆ విషయాన్ని పక్కన పెట్టారు. చివరకు సీసీఎస్ పోలీసులు అరెస్టు చేయాల్సి వచ్చింది.