సిటీబ్యూరో, ఫిబ్రవరి 1(నమస్తే తెలంగాణ): సమ్మర్లో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో విద్యుత్ పీక్ డిమాండ్ ఐదువేల మెగావాట్లకు చేరుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. జనవరి నెలలోనే మార్చి నెల డిమాండ్ నమోదవడంతో సమ్మర్ యాక్షన్ ప్లాన్‌పై అలర్టయ్యారు. జనవరి 31న గత సంవత్సరంతో పోలిస్తే పదిశాతం అధికంగా 3,334 మెగావాట్ల డిమాండ్ రికార్డు స్థాయిలో నమోదైంది. జనవరి నెలలోనే గ్రేటర్లో సమ్మర్ విద్యుత్ డిమాండ్ కనిపిస్తోంది. దీంతో అధికారులు సమ్మర్ యాక్షన్ ప్లాన్‌పై సమీక్ష నిర్వహించారు. ప్రస్తుత విద్యుత్ సరఫరా తీరు, రానున్న వేసవి కాలంలో పెరిగే విద్యుత్ డిమాండ్‌కు తగ్గట్టు నాణ్యమైన విద్యుత్ సరఫరా కోసం సంస్థలో చేపట్టిన ముందస్తు ఏర్పాట్లను విద్యుత్ శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, టీజీఎస్పీడీసీఎల్ సీఎండీ ముషారఫ్ ఫరూఖి పరిశీలించి ముఖ్య అధికారులతో సమీక్ష నిర్వహించారు.
ప్రధానంగా గ్రేటర్ శివారు ప్రాంతాలతో పాటు నల్గొండ, మహబూబ్‌నగర్, మెదక్ జిల్లాల్లో ఎక్కువ విద్యుత్ డిమాండ్ నమోదవుతున్నదని, ఇందుకు తగినట్లుగా ఏర్పాట్లు చేస్తున్నారా? అని అధికారులను ప్రశ్నించారు. గత సంవత్సరం మార్చి నెలలో రాష్ట్ర వ్యాప్తంగా రికాైర్డెన 15వేల మెగావాట్ల పీక్ డిమాండ్, ఈ సంవత్సరం జనవరి 31నే 15,205 మెగావాట్లుగా నమోదైందని, గ్రేటర్ పరిధిలో 3,334 మెగావాట్లుగా రికార్డు స్థాయిలో నమోదయిందని, జనవరిలోనే రాష్ట్రంలో విద్యుత్‌కు సమ్మర్ డిమాండ్ కనిపిస్తున్నట్లుగా వారు చర్చించారు. గత ఏడాది జనవరితో పోల్చుకుంటే ఈ ఏడాది జనవరిలో పీక్ డిమాండ్ 10 శాతం పెరిగింది.
ఇప్పటివరకు తెలంగాణ రాష్టంలో అత్యధిక విద్యుత్ డిమాండ్ గత సంవత్సరం మార్చి 8న 15,623 మెగావాట్ల డిమాండ్ నమోదు కాగా, ఈసారి పీక్ డిమాండ్ 17 వేల మెగావాట్లకు చేరే అవకాశం ఉన్నట్లుగా అధికారులు అంచనా వేస్తున్నారు. ఇదే సమయంలో సమ్మర్లో దక్షిణ డిస్కంలో పీక్ డిమాండ్ పదివేల మెగావాట్లకు, గ్రేటర్ హైదరాబాద్‌లో ఐదువేల మెగావాట్లకు చేరే అవకాశం ఉంది. గతేడాది జనవరిలో రాష్ట్రంలో పీక్ డిమాండ్ 13,810 మెగావాట్లు కాగా, ఈ సారి జనవరి 31న రికార్డు స్థాయిలో 15,205 మెగావాట్లుగా నమోదైంది.
ప్రస్తుత విద్యుత్ వినియోగం డిమాండ్ తీరును పరిశీలిస్తే రానున్న వేసవి కాలంలో డిమాండ్ – వినియోగం భారీగా నమోదయ్యే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. డిమాండ్ ఎంతగా పెరిగినా.., దానికి తగ్గట్టుగా సరఫరా అందించేందుకు విద్యుత్ సంస్థలు సిద్ధంగా ఉన్నాయని, సీనియర్ ఇంజనీర్లను ప్రతి జిల్లాకు నోడల్ అధికారులను నియమించామని అధికారులు తెలిపారు. విద్యుత్ కంట్రోల్ రూమ్ 1912ను బలోపేతం చేశామని, గ్రేటర్ పరిధిలో మాత్రమే కాక గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఈ టోల్ ఫ్రీ నంబర్ ద్వారా విద్యుత్ తక్షణ సేవలను పొందాలని వారు సూచించారు. గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని విద్యుత్ సంస్థల్లో పనిచేసే ప్రతి ఉద్యోగి మరింత అప్రమత్తంగా ఉంటూ సరఫరా విషయంలో వినియోగదారులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని అధికారులకు సూచించారు.
Sss