ఖైరతాబాద్, ఆగస్టు 30: రాష్ట్రంలో ఒక్క సర్పంచ్ ఆత్మహత్య చేసుకున్నా సీఎం రేవంత్ రెడ్డిదే బాధ్యత వహించాల్సి ఉంటుందని తెలంగాణ క్రాంతి దళ్ వ్యవస్థాపక అధ్యక్షుడు పృథ్వీరాజ్ యాదవ్ హెచ్చరించారు. తెలంగాణ సర్పంచ్ల జేఏసీ ఆధ్వర్యంలో సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సర్పంచ్ల పెండింగ్ బకాయిలపై ముఖ్యమంత్రి తీరును ఎండగట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 21 నెలల్లో ఎంతో మంది విద్యార్థులు, యువకులు, రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారని, సీఎం అసమర్థ పాలనలో నేడు సర్పంచ్‌లు ఆత్మహత్యలకు పాల్పడే దుస్థితికి రాష్ర్టాన్ని దిగజార్చారన్నారు.
గ్రామాల అభివృద్ధికి అప్పులు చేసి తీర్చలేక సర్పంచ్‌లు ఆత్మహత్యలకు సిద్ధమవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం రేవంత్ గొప్పలు చెప్పకుంటున్నారని కానీ సర్పంచ్‌లకు 600-700కోట్ల బకాయిలు చెల్లించాలన్న సోయి రావడం లేదన్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత బకాయిల గురించి అడిగితే అరెస్టులు చేయిస్తున్నాడని విమర్శించారు. తన వైఖరిని ఇలాగే ప్రదర్శిస్తే బ్లఫ్ మాస్టర్, 420గా పరిగణిస్తామని ధ్వజమెత్తారు. సీఎంకు రెండు రోజులు సమయం ఇస్తున్నామని, ఆ లోగా బకాయిల విడుదలపై నిర్ణయం తీసుకోవాలని, లేని పక్షంలో ఉద్యమకార్యాచరణ ప్రకటిస్తామని హెచ్చరించారు.
గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో గ్రామాలను అన్ని విధాలుగా అభివృద్ధి చేసి అవార్డులు తీసుకున్నామని రాష్ట్ర సర్పంచ్ల జేఏసీ అధ్యక్షుడు యాదయ్య తెలిపారు. నాడు ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రతి పథకాన్ని విజయవంతంగా అమలు చేస్తూ ప్రజలు, ప్రభుత్వం మన్ననలు పొందామన్నారు. అప్పటి సీఎం కేసీఆర్ ప్రతి గ్రామానికి అభివృద్ధి నిధులు కేటాయించారని గుర్తు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తమకు కష్టాలు మొదలయ్యాయన్నారు.
జూబ్లీహిల్స్ పెద్దమ్మ తల్లికి, ఖైరతాబాద్ మహాగణపతి వద్ద ప్రభుత్వానికి కండ్లు తెరిపించాలని వినతి పత్రాలు పెట్టామని కానీ ప్రభుత్వానికి సోయి రాలేదన్నారు. మంత్రి పొన్నం ప్రభాకర్ దృష్టికి తీసుకువస్తే పరిష్కరిస్తానని చెప్పారు తప్ప సీఎం ముందు ఆయన మాటలకు విలువలేదని తేలిపోయిందన్నారు. కనీసం సచివాలయానికి వెళ్లి వినతి పత్రాలు ఇస్తామని సమావేశం పెట్టుకుంటే రాత్రిరాత్రే అరెస్టు చేయిస్తున్నారన్నారు. అనంతరం మాజీ సర్పంచ్‌లు ప్లకార్డులతో ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సమావేశంలో సర్పంచ్ల జేఏసీ నాయకులు రాజేశ్, నరేశ్, మురళీ, బాలరాజు, మధుసూదన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
– సర్పంచ్ల జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు యాదయ్య