ఖైరతాబాద్, జనవరి 24 : ఏడాది కాలంగా తమకు రావాల్సిన పెండింగ్ బిల్లులను వెంటనే చెల్లించాలని జీహెచ్ఎంసీ కాంట్రాక్టర్స్ అసోసియేషన్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో బుధవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అసోసియేషన్ అధ్యక్షుడు ఎ.రామకృష్ణా రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్ర వ్యాప్తంగా 3,500 మంది చిన్న కాంట్రాక్టర్లు ఉన్నారని, జీహెచ్ఎంసీకి సంబంధించిన డీసిల్టింగ్, పార్కుల అభివృద్ధి, ఫుట్‌పాత్, వీడీసీసీ రోడ్ తదితర పనులు చేపడుతున్నామని తెలిపారు. గతేడాది ఫిబ్రవరి నుంచి నుంచి నేటి వరకు రూ.1,200 కోట్ల బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయని, ప్రస్తుతం వెయ్యి కోట్ల విలువైన పనులు జరుగుతున్నాయన్నారు.
మళ్లీ రూ.500 కోట్లకు సంబంధించిన పనులకు సంబంధించి జీహెచ్ఎంసీ టెండర్లను ఆహ్వానించిందని చెప్పారు. సకాలంలో బిల్లులు రాక అప్పులపాలయ్యామని, ఇద్దరు కాంట్రాక్టర్లు ఆత్మహత్య చేసుకోగా.. మరో ఇద్దరు గుండెపోటుతో మృతిచెందారన్నారు. ప్రభుత్వం బకాయిలను చెల్లించాలని ప్లకార్డులతో నిరసన తెలిపారు. ఈ సమావేశంలో అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి ఎం.సురేందర్ సింగ్, కోశాధికారి ఎండి నిజాముద్దీన్, ఉపాధ్యక్షుడు జి.రమేశ్, ఎండి ఆరీఫ్ అహ్మద్, కల్యాణ్ చక్రవర్తి, అలీ అబ్బాస్, వసంత్ కుమార్, వేణుగోపాల్, సింహాద్రి, రవి తదితరులు పాల్గొన్నారు.