హైదరాబాద్ : హైదరాబాద్ జూబ్లీహిల్స్ (Jubilee Hills) శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయంలో శుక్రవారం పవిత్రోత్సవాలు ( Pavitrotsavam ) వైభవంగా ప్రారంభమయ్యాయి. యాత్రికుల వల్ల, సిబ్బంది వల్ల తెలియక జరిగే దోషాలవల్ల ఆలయ పవిత్రతకు ఎలాంటి లోపం రానీయకుండా నివారించేందుకు పవిత్రోత్సవాలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తుందని అధికారులు తెలిపారు.
ఇందులో భాగంగా ఉదయం స్వామివారిని సుప్రభాతంతో మేల్కొలిపి, తోమాల కొలువు, మూలవర్లకు అభిషేకం నిర్వహించారు. యాగశాల వైదిక కార్యక్రమాల అనంతరం శ్రీదేవి, భూదేవి సమేత కల్యాణ వేంకటేశ్వరస్వామి ఉత్సవర్లకు స్నపన తిరుమంజనం జరిపించారు. ఇందులో భాగంగా ఉత్సవమూర్తులకు పాలు, పెరుగు, తేనె, కొబ్బరినీళ్లు, పసుపు, చందనంతో అభిషేకం చేశారు.
సాయంత్రం 6 గంటలకు యాగశాల వైదిక కార్యక్రమాలు నిర్వహించి పవిత్ర ప్రతిష్ట నిర్వహించనున్నామని ఆలయ అర్చకులు వివరించారు. ఈ కార్యక్రమంలో స్థానిక సలహా మండలి అధ్యక్షులు వేంకటేశ్వర రెడ్డి, ఏఈవో రమేష్ , టెంపుల్ ఇన్స్పెక్టర్ నిరంజన్ కుమార్, ఆలయ అర్చకులు, భక్తులు హాజరయ్యారు.