Patolla Karthik Reddy | కాంగ్రెస్ చేస్తున్న దుర్మార్గాలు, దోపిడీకి వ్యతిరేకంగా ఉద్యమాలు చేయాలని రాజేంద్రనగర్ బీఆర్ఎస్ ఇంచార్జి పటోళ్ల కార్తీక్ రెడ్డి పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పాలనలో రాష్ట్రాన్ని దివాళా తీయించారని మండిపడ్డారు. ఇలానే కొనసాగితే రాష్ట్రం అంధకారంలోకి వెళ్లిపోతుందని ఆవేదన వ్యక్తం చేశారు.
చేవెళ్లలో భూములు అమ్మకానికి పెడితే కొనేవాళ్లు లేరని పటోళ్ల కార్తీక్ రెడ్డి అన్నారు. చేతనై తే మూసీని శుద్ధి చేసి చూపించాలని సీఎం రేవంత్ రెడ్డిని ఉద్దేశించి అన్నారు. ఇళ్లు కూలగొడతామని పేదలను భయపెడుతున్నారని మండిపడ్డారు. మూసీ పేరుతో ఇళ్లు కూలగొడతామంటే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు.
మూసీ ప్రాజెక్టుపై నా పిటిషన్ను కోర్టు డిస్పోసల్ చేసింది.. డిస్మిస్ చేయలేదని పటోళ్ల కార్తీక్ రెడ్డి తెలిపారు. మూసీ ప్రాజెక్టుపై అన్ని అనుమతులు తీసుకుంటామని ప్రభుత్వం ఎన్జీటీకి తెలిపిందని పేర్కొన్నారు. ప్రభుత్వం ఏం చేస్తుందో వేచి చూడాలని ఎన్జీటీ సూచించిందని చెప్పారు. ప్రభుత్వం నిబంధనలు ఉల్లంఘిస్తే మళ్లీ రావాలని ఎన్జీటీ సూచిందని పేర్కొన్నారు. కోర్టుకు చెప్పిన వాటిలో ఏ అంశం చేయకున్నా మళ్లీ ఎన్జీటీకి వెళ్తానని తెలిపారు.