కొడంగల్/దౌల్తాబాద్, అక్టోబర్ 1 : స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ ప్రభంజనం ఖాయమని మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి పేర్కొన్నారు. బుధవారం స్థానిక సంస్థల ఎన్నికల సన్నాహకంలో భాగంగా నియోజకవర్గంలోని కొడంగల్, బొంరాస్‌పేట, దౌల్తాబాద్, దుద్యాల మండలాల్లో ఆయన పర్యటించి ముఖ్య కార్యకర్తల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కాంగ్రెస్ పాలనపై ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో అలవికాని హామీలిచ్చి.. అధికారంలోకి వచ్చి 22 నెలలు దాటినా ఒక్క హామీని కూడా సక్రమంగా నెరవేర్చలేదని మండిపడ్డారు.
చేతకాని కాంగ్రెస్ పాలనలో ప్రజా సంక్షేమంతోపాటు పాలన కూడా కుంటుపడిందన్నారు. రైతులు యూరియా కోసం రోడ్డెక్కినా ప్రభుత్వానికి పట్టడం లేదన్నారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పిస్తామని కొత్త డ్రామాను ప్రభుత్వం మొదలెట్టిందన్నారు. ఎన్నికలను ఆలస్యం చేయాలనే ఆలోచనతోనే బీసీలకు రిజర్వేషన్ అనే అంశాన్ని తెరపైకి తీసుకొచ్చారని ఆరోపించారు.
ఈ నెల 8న కోర్టు తీర్పుతో స్థానిక ఎన్నికల నిర్వహణపై ఒక క్లారిటీ వస్తుందన్నారు. అప్పటివరకు బీఆర్ఎస్ అభ్యర్థులను ఆయా గ్రామాలవారీగా ఎంపిక చేసుకొని ఎన్నికల్లో తలపడేందుకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. రిజర్వేషన్ ఏదైనా, అభ్యర్థి ఎవరైనా బీఆర్ఎస్ గెలుపే ప్రధాన లక్ష్యంగా మనందరం కలిసికట్టుగా కృషి చేద్దామన్నారు.
ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రకటించిన అమలుకు నోచుకోలేని 6 గ్యారెంటీలను బ్రహ్మా్రస్త్రంగా ఉపయోగించి.. వాటిని క్షేత్రస్థాయిలో పెద్దఎత్తున ప్రచారం చేస్తే బీఆర్ఎస్ విజయం ఖాయమన్నారు. రేవంత్ సీఎం అయినా కొడంగల్ దశ మారలేదని.. కేవలం రోడ్లకు మరమ్మతులు చేస్తే అభివృద్ధి కాదన్నారు. కమీషన్లు తీసుకోవడం కోసమే రోడ్ల పనులను నాసిరకంగా చేస్తున్నారని.. అవి రెండు నెలలకే కొట్టుకుపోతున్నాయని ఆరోపించారు.
కొడంగల్ సెగ్మెంట్‌కు లక్షా50వేల ఎకరాలకు సాగునీరు అందించేలా కేసీఆర్ పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని డిజైన్ చేయగా.. రిజర్వాయర్లు పూర్తి కాగా మరో రూ.1500 కోట్లు వెచ్చించి కాల్వల పనులను పూర్తి చేస్తే కొడంగల్‌కు సాగు, తాగు నీరు అందేదన్నారు. కానీ, ఆ విషయంలో రేవంత్‌రెడ్డి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారన్నారు. కర్ణాటక ఆల్మట్టి డ్యాంను 18 ఫీట్ల ఎత్తు పెంచితే జూరాల, శ్రీశైలానికి నీటి జాడ లేకుండా పోయి తెలంగాణకు తాగు, సాగునీటి కష్టాలు వస్తాయని హెచ్చరించారు. ముఖ్యమంత్రి మాత్రం ఆల్మట్టి డ్యాం పెంపుపై ఎటువంటి వ్యాఖ్యలు చేయడంలేదని ఆయన ఆరోపించారు.
ఆయా కార్యక్రమాల్లో బీఆర్ఎస్ కొడంగల్ మండలాధ్యక్షుడు దామోదర్‌రెడ్డి, బీఆర్ఎస్ దుద్యాల మండలాధ్యక్షుడు చాంద్‌పాషా, మాజీ జడ్పీ వైస్ చైర్మన్ కృష్ణ, మాజీ ఎంపీపీలు దయాకర్‌రెడ్డి, మధుసూదన్‌రెడ్డి, మాజీ జడ్పీటీసీలు కోట్ల మహిపాల్, వెంకటమ్మ, మాజీ కౌన్సిలర్ మధుసూదన్‌రావు యాదవ్, బొంరాస్‌పేట పీఏసీఎస్ మాజీ అధ్యక్షుడు విష్ణువర్ధన్‌రెడ్డి, నాయకులు సురేశ్, గుండప్ప, శ్రీనివాస్, బాబర్, నర్మద, బాలమణి, సముద్రమ్మ, సంతోశ్, కేశవరెడ్డి, నర్సింహులు, నర్సప్ప, పలువురు మాజీ ఎంపీటీసీలు, మాజీ సర్పంచులు పాల్గొన్నారు.