హైదరాబాద్: ఎబోలా వ్యాధి లక్షణాలు(Ebola Case) ఉన్న సుడాన్ ప్రయాణికుడు ఒకరు ఇవాళ శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్నారు. వైరస్ లక్షణలు కనిపించడంతో అతన్ని తక్షణమే నగరంలోని గాంధీ ఆస్పత్రికి తరలించారు. ఎమర్జెన్సీ ప్రణాళిక ప్రకారం సుడాన్ వ్యక్తిని ఆస్పత్రికి తీసుకెళ్లారు. గాంధీ ఆస్పత్రిలోని ఐసోలేషన్ వార్డులో అతనికి చికిత్స కొనసాగిస్తున్నారు. ప్రత్యేక అంబులెన్సులో అతన్ని ఎయిర్‌పోర్టు నుంచి ఆస్పత్రికి తరలించారు.
పేషెంట్ నుంచి గాంధీ వైద్యులు శ్యాంపిళ్లు సేకరించారు. పుణెలో ఉన్న నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీకి ఆ శ్యాంపిళ్లను పంపించారు. అక్కడ డయాగ్నస్టిక్ పరీక్షలు నిర్వహించనున్నారు. అయితే ల్యాబ్ ఫలితాల కోసం అధికారులు వేచి చూస్తున్నారు. ప్రస్తుతం ఆఫ్రికా దేశాల్లో ఎబోలా వైరస్ కేసులు అధికంగా నమోదు అవుతున్న విషయం తెలిసిందే. దీంతో తెలంగాణ ఆరోగ్యశాఖ విమానాశ్రయాల వద్ద ప్రత్యక స్క్రీనింగ్ చేపడుతోంది.
ఎబోలా మేనేజ్మెంట్ కోసం తెలంగాణలో గాంధీ ఆస్పత్రిని నోడల్ సెంటర్‌గా గుర్తించారు. ఇక్కడ ప్రత్యేకమైన ఐసోలేషన్ వసతులు ఏర్పాటు చేశారు. ఎబోలా కేసులకు చికిత్స అందించేందుకు కొన్ని మెడికల్ బృందాలను స్టాండ్‌బైగా పెట్టుకున్నారు. శంషాబాద్ విమానాశ్రయంలో అంతర్జాతీయ ప్రయాణికులకు థర్మల్ స్క్రీనింగ్ నిర్వహిస్తున్నారు. ఆ సమయంలో సుడాన్ ప్రయాణికుడికి జ్వరం ఉన్నట్లు గుర్తించారు. ప్రస్తుతానికి ఎబోలా ఉన్నట్లు నిర్ధారణ కాలేదు. కానీ అతని ట్రావెల్ హిస్టరీ కారణంగా .. అనుమానంతో శ్యాంపిళ్లను టెస్టింగ్‌కు పంపినట్లు అధికారులు చెప్పారు.