సిటబ్యూరో, మే27 (నమస్తే తెలంగాణ): ఉస్మానియా జనరల్ హాస్పిటల్లో రోగుల కోసం 24 గంటలపాటు రోగి సహాయక సేవలకోసం హెల్ప్‌లైన్ డెస్క్‌ను ప్రారంభించారు. ఆస్పత్రి సూపరింటెండెంట్ రాకేశ్ సహాయ్, బీఎస్బీ హ్యూమన్ డెవలప్మెంట్ ట్రస్ట్ ప్రతినిధి సల్మాన్ బాబు ఖాన్ కలిసి మంగళవారం ఈ సేవలను ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఈ సేవలతో రోగులకు తక్షణ సహాయం, మార్గనిర్దేశం అందుతుందన్నారు.
ప్రభుత్వ హాస్పిటల్స్‌లో రోగులకు మెరుగైన సేవలు అందించేందుకు హెల్పింగ్ హ్యాండ్ ఫౌండేషన్(హెచ్హెచ్ఎఫ్) వంటి సంస్థలను ప్రోత్సహిస్తున్నట్లు చెప్పారు. ఉస్మానియా జనరల్ హాస్పిటల్లో రోగులకు నిరంతరాయంగా సేవలందించేందుకు హెల్పింగ్ హ్యాండ్ ఫౌండేషన్‌కు చెందిన 20 మందికి పైగా శిక్షణ పొందిన స్వచ్ఛంద సేవకుల బృందం మూడు షిఫ్టులుగా సేవలు అందించనుందన్నారు. వీరంతా వివిధ విభాగాలకు రోగులను నడిపించడం, ఓపీ సేవల్లో సహకరించడం, గుర్తు తెలియని, అనాథ రోగులకు వైద్యం అందించడంలో కీలకంగా పనిచేస్తారన్నారు.
హాస్పిటల్ పరిసరాల్లో కనిపించే అనాథ రోగులను సోషల్ హెల్త్ వర్కర్ల సహాయంతో శుభ్రం చేసి, బట్టలు తొడిగి, వైద్యం పొందేలా సహకరిస్తారన్నారు. వీల్ చైర్లు వంటి పేషెంట్ మోబిలిటీ సేవల కోసం ఈ ప్రత్యేక హెల్ప్‌లైన్ అమలు చేయడం అత్యంత అవసరమన్నారు. అత్యవసర విభాగం పక్కన ఉన్న ఓపీ బ్లాక్ ర్యాంప్ పక్కనున్న ఖాళీ ప్రదేశాన్ని ఒక వార్‌రూమ్‌లా మార్చామన్నారు. అక్కడే ఈ ప్రత్యేక హెల్ప్‌లైన్ కేంద్రం ఏర్పాటు చేశామన్నారు. రోగులు 77802 88622 ఈ హెల్ప్‌లైన్ నెంబర్లో సంప్రదించవచ్చని వారు పేర్కొన్నారు.