పటాన్చెరు టౌన్, ఏప్రిల్ 14 :గంజాయి అమ్ముతున్న వ్యక్తిని పటాన్చెరు పోలీసులు పట్టుకొని అతని నుంచి 798 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఎస్ఐ ఎన్.రాజు తెలిపిన వివరాల ప్రకారం… బీహార్ రాష్ట్రం సమస్తిపూర్ జిల్లా భగవత్పూర్కు చెందిన సురేశ్ రాయ్ కొంతకాలంగా ఇంద్రేశం మున్సిపాలిటీ రామేశ్వరం బండలోని డైరీ ఫామ్‌లో పని చేస్తున్నాడు. మూడు నెలలుగా ఒడిశా రాష్ట్రంలోని మల్కనగిరి జిల్లా అటవీ ప్రాంతం నుంచి ఎండు గంజాయిని కొనుగోలు చేసి పటాన్చెరు ప్రాంతంలో వ్యసనపరులకు అమ్ముతూ వ్యాపారం చేస్తున్నాడు.
ఒడిశా రాష్ట్రం మల్కనగిరి అటవీ ప్రాంతంలో గుర్తు తెలియని వ్యక్తుల నుంచి కిలో ఎండు గంజాయిని కొనుగోలు చేసి ఈనెల 13న ఆర్టీసీ బస్సులో పటాన్‌చెరుకు సురేశ్రాయ్ వచ్చి 200 గ్రాముల గంజాయిని అమ్మి రామేశ్వర్బండలోని డైరీ ఫామ్‌కు వెళ్లాడు. విశ్వసనీయ సమాచారం మేరకు ఎస్ఐ రాజు పోలీసు సిబ్బందితో కలిసి అతన్ని పట్టుకొని విచారించగా 798 గ్రాముల గంజాయి లభించింది. గంజాయి, మొబైల్‌ను సీజ్ చేసి నిందితున్ని రిమాండ్‌కు తరలించినట్లు ఎస్ఐ ఎన్ రాజు తెలిపారు.