శంషాబాద్ రూరల్, ఫిబ్రవరి 26: వారణాసి వెళ్లాల్సిన స్పైజెట్ విమానం దాదాపు 4 గంటలు ఆలస్యం కావడంతో శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ప్రయాణికులు ఆందోళనకు దిగిన సంఘటన బుధవారం చోటుచేసుకున్నది. ప్రయాణికులు తెలిపిన ప్రకారం.. శంషాబాద్ ఎయిర్‌పోర్టు నుంచి ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న కుంభమేళాలో పుణ్యస్నానాలు చేసేందుకు వెళ్తున్న ప్రయాణికులకు స్సైజెట్ ఎయిర్‌లైన్స్ అధికారులు షాక్ ఇచ్చారని తెలిపారు. ఉదయం 10 గంటలకు శంషాబాద్ ఎయిర్‌పోర్టు నుంచి వారణాసి వెళ్లాల్సిన విమానం సమయానికి ఎయిర్‌పోర్టుకు చేరుకున్నదని, ప్రయాణికులు బోడింగ్పాసులు తీసుకొని లోపలికి వెళ్లారని చెప్పారు.
తర్వాత ఎయిర్‌లైన్స్ సిబ్బంది సాంకేతిక సమస్యతో విమానం ఆలస్యమవుతుందని చావు కబురు చల్లగా చెప్పి వెళ్లిపోయారని ప్రయాణికులు వాపోయారు. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 4 గంటల పాటు ఎయిర్‌పోర్టులో వేచి చూసిన ప్రయాణికులను ఎయిర్‌లైన్స్ అధికారులు ఎలాంటి సౌకర్యాలు కల్పించలేదని, కనీసం తాగునీరు ఇవ్వడంలేదన్నారు. మధ్యాహ్నం 2 గంటలకు ఎయిర్‌లైన్స్ అధికారులు ప్రయాణికుల వద్దకు వచ్చి సరైన సమాచారం చెప్పకుండానే వెళ్లిపోయారని, కుంభమేళాలో పుణ్యస్నానాలు చేసేందుకు విమానం టికెట్ బుక్ చేసుకున్న మాకు తిరిగి వచ్చే విమానం ఎలా దొరుకుతుందని ప్రశ్నించారు. వేలు పెట్టి టికెట్ తీసుకున్న మాకు కనీసం ఎలాంటి సౌకర్యాలు కల్పించలేదని వాపోయారు. ఎయిర్‌లైన్స్ అధికారులపై చర్యలు తీసుకోవాలని శంషాబాద్‌లోని జీఎంఆర్ ఎయిర్‌పోర్టు అధికారులను ప్రయాణికులు కోరారు. కుంభమేళా చివరి రోజు కావడంతో పుణ్యస్నానాలు ఆచరించేందుకు వెళ్తున్న ప్రయాణికులకు ఎయిర్‌లైన్స్ అధికారులు నిరాశే మిగిల్చారని పలువురు ప్రయాణికులు విమర్శించారు.