సిటీబ్యూరో: ప్రజా రవాణాపై భారం పెరిగితే ప్రయాణికులు సొంత వాహనాలపై ఆధారపడే అవసరం పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. ఇప్పటికే నగరంలో 88 లక్షలకు పైగా అన్ని రకాల వాహనాలు ఉన్నాయి. ప్రతీ రోజు సుమారు 800 నుంచి 11 వందల వాహనాలు కొత్తగా రోడ్డెక్కుతున్నాయి. పెరిగిన వాహనాల సంఖ్యకు తగ్గ రోడ్ల విస్తీర్ణం లేక ట్రాఫిక్ జాం సమస్య తలెత్తుతున్నది. ఇటీవల కాంగ్రెస్ ఫ్రభుత్వం పెంచిన టికెట్ చార్జీలతో రోజూ ప్రయాణం చేసేవారిపై రూ.10 వరకు భారం పెరిగింది.
ఆర్డినరీలో 8 కి.మీలు ప్రయాణిస్తే రూ.30 చార్జీ ఉండగా, ఏసీ మెట్రోలో అదే 8 కిలో మీటర్లకు రూ.50 చెల్లించాలి. ఒక ప్రయాణికుడు ప్రతీ రోజు ఒక 16 కిలో మీటర్ల ప్రయాణం చేసి ఇంటికి తిరిగి వస్తే అంటే పోనూ రూ.50, రాను రూ.50 అనగా, అతడికి 100 రూపాయల ఖర్చు వస్తుంది. ఈ లెక్కన ద్విచక్ర వాహనానికి అదే వంద రూపాయల పెట్రోల్‌తో సుమారు 40 నుంచి 60 కిలో మీటర్లు ప్రయాణం చేయొచ్చు. ఈ భావనతో చాలా మంది ప్రయాణికులు సొంత వాహనాలు లేదా సెకండ్ హ్యాండ్ వాహనాలు కొనుగోలు చేసే అవకాశం పెరుగుతుంది. దీని వల్ల నగరంలో కాలుష్యం పెరిగే అవకాశం ఉంటుంది. గ్రేటర్లో సుమారు మూడు వేలకుపైగా ట్రాఫిక్ జంక్షన్లు ఉన్నాయి.
సుమారు 1400 జంక్షన్లలో 30 సెకండ్లకు మించి సిగ్నల్స్ పడుతున్నాయి. ఒక్కో సిగ్నల్ వద్ద గరిష్టంగా 150 వరకు వాహనాలు నిలుస్తున్నాయి. ఒక వాహనం 40 పీపీఎం కార్బన్ డయాక్సైడ్ చొప్పున కాలుష్యాన్ని విడుదల చేస్తున్నాయి. ఇలా ఒక్కో సిగ్నల్ వద్ద ఆగేవారు 8వేల పీపీఎం కార్బన్ డయాక్సైడ్తో పాటు ఇతర కాలుష్యాన్ని పీల్చుకుంటున్నారని నిపుణులు చెబుతున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ప్రజా రవాణా సదుపాయాలను పెంచాల్సింది పోయి టికెట్ ధరలు పెంచడం విడ్డూరంగా ఉందని కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.