సిటీబ్యూరో, ఆగస్టు 29 (నమస్తే తెలంగాణ): గ్రేటర్లో బస్సుల సంఖ్య పెంచాలంటూ విద్యార్థులు, ప్రజా సంఘాలు, ప్రయాణికులు ఆర్టీసీ అధికారులకు ఎన్నిసార్లు విజప్తి చేసినా ఆ దిశగా ఆర్టీసీ అడుగులు వేయడం లేదు. విద్యాసంస్థల ప్రారంభానికి ముందర ఏప్రిల్, మే నెలల్లో ప్రజా సంఘాలు, విద్యార్థులు కలిసి లక్ష సంతకాల క్యాంపెయిన్ కూడా చేపట్టారు. క్యాంపెయిన్ రిపోర్ట్‌ను ఆర్టీసీ ఉన్నతాధికారులకు అందించి బస్సుల సంఖ్య పెంచాలని డిమాండ్ చేశారు. కానీ ఇప్పటివరకు బస్సుల సంఖ్య పెంచలేదు. మరోవైపు మహాలక్ష్మి ఉచిత బస్సు పథకంతో సిటీ బస్సుల్లో ఆక్యుపెన్సీ రేషియో 95 శాతానికి పెరిగింది.
గ్రేటర్ జోన్ పరిధిలో ఆర్టీసీ నడుపుతున్న సిటీ బస్సులో రోజు 24 లక్షల మంది ప్రయాణాలు సాగిస్తుండగా వారిలో 15-18 లక్షల మంది వరకు మహిళలే ఉంటున్నారు. ప్రయాణికుల రద్దీ రెట్టింపైనా ఆర్టీసీ అధికారులు 25 బస్ డిపోల మేనేజర్లు రద్దీ సమయాల్లో చర్యలు తీసుకోవడం లేదు. ఫలితంగా నగర శివార్ల, శివార్ల నుంచి నగరానికి రావాలంటే సమయానికి, సరిపడా బస్సులు లేక ప్రయాణికులు నానా అవస్థలు పడుతున్నారు. మూడు, నాలుగు బస్సులు మారితేగానీ శివార్లకు వెళ్లలేని పరిస్థితి నెలకొందని వాపోతున్నారు. రాత్రి 9 దాటిందంటే ప్రధాన మార్గాల్లో నడిచే బస్సులు కూడా కనిపించడం లేదంటూ చెబుతున్నారు.
శివార్ల నుంచి నగరంలో పలు ప్రధాన మార్గాలకు బస్సులు నడపాలని ప్రజలు కోరుతున్నారు. ఆదిబట్ల, దుండిగల్, మోకిల, శంకర్పల్లి, కొల్లూర్ నియోపాలిస్ సమీపంలోని ప్రాంతాలకు అరకొర బస్సులు కాకుండా సరిపడా నడపాలని ప్రయాణికులు డిమాండ్ చేస్తున్నారు. గండిమైసమ్మ నుంచి ప్రగతినగర్ మీదుగా బస్సు నడపాలని ఇప్పటికే ఆర్టీసీకి విజప్తి పత్రాలు అందించారు. గండి మైసమ్మ మార్గంలో రాంపల్లి, దమ్మాయిగూడ, బాలాజీనగర్‌కు బస్సులు నడపాలని ఉద్యోగులు, విద్యార్థులు కోరుతున్నారు. అయితే ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా ఆర్టీసీ మాత్రం పట్టించుకోవడం లేదని విమర్శలు వస్తున్నాయి. గ్రేటర్లో కోటి జనాభా దాటగా.. జనాభాకు తగినట్లుగా సుమారు 6వేల బస్సులు ఉండాలి. కానీ ఇప్పుడు కేవలం 2,700 బస్సులు మాత్రమే రాకపోకలు సాగిస్తున్నాయి.
రద్దీఎక్కడ ఉంది? బస్సులు సరిపడా ఉన్నాయా? లేదా? అని పరిశీలించే అధ్యయనాలు అధికారులు మరిచారని విమర్శలు వస్తున్నాయి. ప్రయాణికులకు మెరుగైన సేవలదించేందుకు క్షేత్ర స్థాయిలో అధికారులు అధ్యయనాలు చేయాల్సి ఉంటుంది. ఏ రూట్లో బస్సులు పెంచాలో రిపోర్ట్ రెడీ చేయాలి. కానీ అధికారులు ఆ దిశగా క్షేత్రస్థాయి పరిశీలను, సమీక్షలు నిర్వహించడంలేదు. కొందరు ఆర్టీసీ డ్రైవర్లు ర్యాష్ డ్రైవింగ్ చేస్తున్నారని ప్రయాణికుల నుంచి ఫిర్యాదులు అందాయి. అలాగే పలు బస్సులను రోడ్డు మధ్యలోనే ఆపుతుండటంతో బస్సు ఎక్కేందుకు ప్రయాణికులు పరుగులు తీస్తున్నారు. ఈ క్రమంలో పలువురు ప్రమాదాలకు గురవుతున్నారు. సెలవు రోజుల్లో రద్దీ మార్గాల్లో బస్సులను మరింత తగ్గిస్తున్నారు. 30శాతం బస్సులు డిపోలకే పరిమితమవుతున్నాయి. సాధారణ రోజుల్లోనే రాత్రి 9 దాటితే బస్సులు తక్కువగా నడుస్తున్నాయి.
టైంటేబుల్ ప్రకారం ఆర్టీసీ బస్సులను నపడలేకపోతున్నది. కొన్నిసార్లు ఆఖరి నిమిషంలో బస్సులను రద్దు చేస్తున్నారు. ప్రధానంగా మరమ్మతులు, ట్రాఫిక్ సమస్యలు, సిబ్బంది కొరత వంటి కారణాలతో ఆర్టీసీ బస్సులు రద్దవుతున్నాయి. అలాగే నగరాల్లో తిరిగే సిటీ బస్సులతో పాటు జిల్లాల నుంచి హైదరాబాద్‌కు వచ్చీపోయే బస్సులు పలు సందర్భాల్లో ట్రాఫిక్ వలయంలో చిక్కుకుని గంటల తరబడి ఆలస్యమవుతున్నాయి. ఆర్టీసీలో డ్రైవర్లు, కండక్టర్లు పెద్ద సంఖ్యలో రిటైర్ అవుతున్నారు. వారి స్థానాల్లో కొత్తగా ఉద్యోగాలు భర్తీ చేయాలి. కానీ ఆ దిశగా అడుగులు పడటం లేదు. 3వేల పోస్టులు భర్తీ చేయాల్సి ఉన్నా అది ముందుకు సాగడం లేదని కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.