సిటీబ్యూరో, మే 30 (నమస్తే తెలంగాణ): పార్లమెంట్ ఎన్నికల ఓట్ల లెక్కింపు కేంద్రాల వద్ద బందోబస్తు ఏర్పాట్లకు తీసుకోవాల్సిన చర్యలపై గురువారం నగర పోలీస్ కమిషనర్ కొత్తకోట శ్రీనివాస్‌రెడ్డి నేతృత్వంలో బంజారాహిల్స్‌లోని ఐసీసీసీ భవనంలో సమావేశాన్ని ఏర్పాటు చేశారు. హైదరాబాద్, సికింద్రాబాద్ పార్లమెంట్, కంటోన్మెంట్ అసెంబ్లీ ఉప ఎన్నికలకు సంబంధించిన ఓట్ల లెక్కింపు జూన్ 4న జరుగనున్నాయి.
ఈ నేపథ్యంలో కౌంటింగ్ కేంద్రాల వద్ద ఏర్పాట్లపై అధికారులు, సిబ్బందికి దిశానిర్దేశం చేశారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద తీసుకోవాల్సిన జాగ్రత్తలు, నియమ నిబంధనలను జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రాస్ రిటర్నింగ్, అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులకు వివరించారు. కౌంటింగ్ కేంద్రాల్లోకి ఎవరిని అనుమతించాలి.. ఎవరిని అనుమతించకూడదు.. మీడియా సెంటర్, కేంద్రాల వద్ద ఏర్పాట్లు, కౌంటింగ్ ఏజెంట్లకు సంబంధించిన వివరాలను వివరించారు. నగర పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ కౌంటింగ్ కేంద్రాల వద్ద మూడంచెల భద్రత ఉంటుందని, ఎన్నికల కమిషన్ నియమ నిబంధనలు పక్కాగా అమలు చేయాలని సూచనలు చేశారు.