సిటీబ్యూరో, సెప్టెంబర్ 10 (నమస్తే తెలంగాణ): నవ్విపోదురు గాక నాకేంటీ అన్న చందంగా బుద్ధ పూర్ణిమ ప్రాజెక్టు అధికారులు వ్యవహరిస్తున్నారు. సామాన్యుడి నడ్డి విరిచేలా దళారులు పార్కింగ్ ఫీజు ముక్కు పిండి వసూలు చేస్తున్న పట్టించుకున్న పాపాన పోవడం లేదు. ట్యాంక్ బండ్ పరిసరాల్లో ఎన్టీఆర్ ఘాట్, ఐమ్యాక్స్ సమీపంలో హెచ్ఎండీఏ నిర్వహించే పార్కింగ్ ఫెసిలిటీ కోసం వాహనదారుల నుంచి రెండింతలు పార్కింగ్ ఫీజు వసూలు చేసి హెచ్ఎండీఏ ఖజానాకు గండికొడుతున్నా.. అధికారులు స్పందించడం లేదు.
అందిన కాడికి వాహనదారుల నుంచి వసూలు చేస్తూ… తిలా పాపం తలా పిడికెడు మాదిరి పంచుకున్నట్లుగా ట్యాంక్ బండ్ పార్కింగ్ దందా యథేచ్ఛగా సాగుతుంది. ఇందులో ప్రధాన పాత్ర పోషిస్తున్న ఇద్దరు అధికారుల ప్రమేయమే దళారీ రెండింతలు పార్కింగ్ ఫీజు వసూలు చేయడానికి ప్రధాన కారణమని, దిక్కు ఉన్న చోట చెప్పుకోమంటూ వాహనదారులపై విరుచుకుపడుతుండటం కొసమెరుపు.
అసలే గణపతి నవరాత్రులు, అందులో ఖైరతాబాద్ బడా గణేశుడి ఉత్సవం. ఇక వీకెండ్ వచ్చిందంటే ట్యాంక్ బండ్ పరిసరాలు సందడిగా మారుతుంటాయి. గణేశ్ ఉత్సవాల ప్రారంభం నుంచే ఈ ప్రాంతంలో వాహనాల తాకిడి భారీగా పెరిగితే… ఇప్పుడు పార్కింగ్ కాంట్రాక్టర్లకు కాసులు కురిపిస్తోంది. ట్యాంక్ బండ్‌పై హెచ్ఎండీఏ అధికారుల సహకారంతో యథేచ్ఛగా రెండింతలు వసూలు చేస్తూ..
ఖజానా ఖాళీ చేయడంలో దళారీకి అధికారులు సహకరిస్తున్నారు. నిబంధనల ప్రకారం టూ, త్రీ వీలర్‌కు రూ.20, కారుకు రూ.40 చొప్పున వసూలు చేయాల్సి ఉండగా.. కారుకు రూ.100 చొప్పున ముక్కు పిండి వసూలు చేస్తున్నారు. ఇక బైకులు, ఆటోలకు రూ. 50 నుంచి 70 చొప్పున లాగేస్తుండగా అడిగేవారు లేకుండా పోయారు.
కమిషనర్ చెప్పాడంటూ.. బీపీపీ అధికారుల బుకాయింపు
అధిక పార్కింగ్ ఫీజుల వసూళ్లపై సంబంధిత అధికారుల వివరణ కోరగా.. హెచ్ఎండీఏ కమిషనర్ డబుల్ చార్జీలు వసూలు చేసుకోవాలని ఆదేశాలు ఇచ్చారేమో అంటూ బీపీపీ అధికారులు బుకాయించారు. దీనిపై నమస్తే తెలంగాణ.. హెచ్ఎండీఏ కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్‌ను వివరణ కోరే ప్రయత్నం చేయగా.. కనీసం స్పందించ లేదు. ఓ వాహనదారుడి నుంచి కారుకు రూ.100 చొప్పున వసూలు చేసిన బిల్లింగ్‌తో అందించినా.. అసలు దీనిపై సమాచారమే లేదన్నట్లు వ్యవహరించారు. బీపీపీ అధికారులు దీనిపై మాట్లాడేందుకు పెదవి విరిచారు. టెండర్ ప్రక్రియ పూర్తయ్యేంత వరకు బీపీపీ, హెచ్ఎండీఏ అధికారులు అటు వైపు కన్నెత్తి కూడా చూడకూడదనే మౌఖిక ఆదేశాలు కూడా ఉన్నాయనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రసీదుపై అధికారికంగా వసూలు చేయడం వెనుక.. పార్కింగ్ ధరలు ఎందుకు పెంచి వసూలు చేస్తున్నారన్న సందేహాలు ఉన్నాయి. దళారీకి లబ్ధి చేకూర్చేలా బీపీపీ అధికారులు ఎందుకు వ్యవహరిస్తున్నారనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అడ్డగోలుగా రెండింతల ఫీజు వసూలు చేయడం వెనుక దళారీ, బీపీపీ అధికారులు ప్రమేయం ఉందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.