“నా బిడ్డ ఉక్రెయిన్‌లో చిక్కుకుపోయింది. ఫోన్ కలవడం లేదు. ఎలా ఉందో కూడా తెలియదు. ఉదయం ఒక్కసారి ఫోన్ చేసి డాడీ..డాడీ అంటూ ఏడ్చింది. మళ్లీ ఫోన్ కట్ అయింది. నా బిడ్డకు ఏమైందో తెలియడం లేదు.’ ఇది ఉక్రెయిన్‌లో చిక్కుకున్న ఓ వైద్య విద్యార్థి తండ్రి ఆక్రందన.
‘డాడీ నాకు ఆకలి అవుతుంది. ఇక్కడ తినేందుకు ఏమీ లేదు. భయంగా ఉంది. బంకర్లో ఉన్నాం. డబ్బులు కూడా లేవు. ఏటీఎంలు పనిచేయడం లేదు. నన్ను తీసుకెళ్లు డాడీ’ ఇది ఉక్రెయిన్‌లో చదువుతున్న ఓ తెలంగాణ విద్యార్థి ఆవేదన.
“సైరన్ వినిపించగానే బంకర్లోకి వెళుతున్నాం. మళ్లీ 25 నిమిషాలకు బయటకు వస్తున్నాం. మళ్లీ సైరన్ మోగగానే బంకర్లోకి.. ఇలా రోజులో కనీసం 15 సార్లు అయినా.. బంకర్లోకి వెళ్లి తలదాచుకుంటున్నాం. తినడానికి తిండి లేదు. చాలా భయం వేస్తుంది. మా అమ్మనాన్నలు గుర్తొస్తున్నారు.’ ఇది ఎంబీబీఎస్ ఫైనల్ ఇయర్ చదువుతున్న ఓ విద్యార్థి భయం.
“ అమ్మా..నాన్న.. మిమ్మల్ని చూడాలని ఉంది. నా కోసం ఎంతో చేసిన మిమ్మల్ని సంతోషంగా చూడటానికి డాక్టర్ కావాలని ఇంత దూరం వచ్చాను. ఇప్పుడు నేను ఉక్రెయిన్‌లో ఉన్న కీవ్ ప్రాంతానికి మూడు గంటల జర్నీ దూరంలో ఓ బంకర్లో ఉన్నాను. మళ్లీ మిమ్మల్ని చూస్తానా? లేదా? అని భయం వేస్తుంది డాడీ.” ఇది ఉక్రెయిన్‌లో చదువుతున్న మరో వైద్య విద్యార్థిని ఆవేదన.
యుద్ధం నేపథ్యంలో ఉక్రెయిన్‌లో చిక్కుకున్న తెలంగాణ విద్యార్థులు అల్లాడిపోతున్నారు. తమను రక్షించాలని వేడుకుంటున్నారు. అమ్మా..నాన్నలకు ఫోన్ చేసి సమాచారం అందిస్తూ కొందరు.. ఫోన్లు కలవక అయోమయంలో మరికొందరు.. ఏం చెయ్యాలో తెలియక రోదిస్తున్నారు. మరోవైపు తెలంగాణ ప్రభుత్వం విద్యార్థులను సేఫ్‌గా తీసుకొచ్చేందుకు విదేశీ మంత్రిత్వ శాఖతో ఎప్పటికప్పుడు సంప్రదిస్తూ.. వివరాలను ఆరా తీస్తున్నది.
– సిటీబ్యూరో, ఫిబ్రవరి 25 ( నమస్తే తెలంగాణ)
మాది రంగారెడ్డి జిల్లా. నేను ఉక్రెయిన్‌లోని జపొర్జియా మెడికల్ యూనివర్సిటీలో ఎంబీబీఎస్ రెండో సంవత్సరం చదువుకుంటున్నా. మేం ఎక్కాల్సిన ఫ్లైట్ ఎయిర్‌పోర్ట్‌లో ల్యాండ్ అయింది. కానీ ఏమైందో తెలియదు. మళ్లీ ఆ ఫ్లైట్ టేకాఫ్ తీసుకుంది. మేమంతా ఒక్కసారిగా కలవరపడ్డాం. మమ్మల్ని యూనివర్సిటీ కన్సల్టెన్సీ వాళ్లు దగ్గర్లోని బస్టాండ్‌కు తీసుకెళ్లారు. సాయంత్రం వరకు అక్కడే ఉంచారు. ఆ తర్వాత సమీపంలోని బోగొమోలెట్స్ యూనివర్సిటీలోకి పంపించారు. అక్కడే ఉండాలని చెప్పారు. సైరన్ వినిపించినప్పుడల్లా బంకర్లోకి వెళ్తున్నాం. ఇంటర్నెట్ పనిచేయడం లేదు. వైఫై కనెక్ట్ అవడం లేదు. – గూడ శ్రీనిధి, ఎంబీబీఎస్ విద్యార్థిని
లాల్‌దర్వాజలో మేం ఉంటాం. మా పెద్ద కుమారుడు కె.రాహుల్‌గుప్తా (20), ఎంబీబీఎస్ చదువు కోసం ఉక్రెయిన్ వెళ్లాడు. ప్రస్తుతం ఎంబీబీఎస్ మూడో సంవత్సరం చదువుతున్నాడు. అయితే అక్కడి పరిస్థితులేమీ బాగోలేవని, వర్సిటీ గదులను వదిలి భూమిలో ఏర్పాటు చేసిన బంకర్లో ఓ రోజు తలదాచుకున్నానని రాహుల్ చెప్పాడు.
-జ్యోతిక
మాది బడంగ్‌పేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని సాయిబాలాజీ నగర్. నా కొడుకు వంకాయల పతి విష్ణువర్ధన్ 2021 నవంబర్‌లో ఉక్రెయిన్‌లోని లివీవ్‌లో ఎంబీబీఎస్ చదివేందుకు వెళ్లాడు. అక్కడి పరిస్థితులు చాలా భయానకంగా ఉన్నాయి. ఇండియన్ ఎంబసీ నుంచి ఎలాంటి స్పందన రావడం లేదు.
– సతీశ్
మాది అల్మాస్గూడ. ఉక్రెయిన్‌లోని వినిత్సియా సిటీలో ఎంబీబీఎస్ చదువుతున్నాను. మేమంతా బంకర్లో ఉన్నాం. కరెంట్ లేదు. ఫోన్లు పనిచేయడం లేదు. 25న టికెట్ బుక్ చేసుకున్నాను. ఇంతలోనే ఇక్కడి పరిస్థితులు మొత్తం మారిపోయాయి. స్నేహితుల సాయంతో పేరెంట్స్‌తో మాట్లాడుతున్నా. దయచేసి మమ్మల్ని కాపాడండి. మా అమ్మనాన్నలను చూడాలని ఉంది.
-కోరె నిషా రాణి, ఎంబీబీఎస్ విద్యార్థ
బీఎన్‌రెడ్డినగర్ డివిజన్ మహాలక్ష్మీకాలనీలో ఉంటాం. నా కుమార్తె హర్షిత(24) జపొర్జియా వర్సిటీలో మెడిసిన్ చదువుతున్నది. ప్రభుత్వం చొరవ తీసుకుని, నా బిడ్డను ఇండియాకు తీసుకురావాలని విజ్ఞప్తి చేస్తున్నాం. – చందుబంకర్లలో బస
మల్కాజిగిరి విమలాదేవీనగర్లో ఉంటాం. నా కుమారుడు వెల్లురు సంపత్‌కుమార్ శరత్ ఉక్రెయిన్‌లో మెడిసిన్ చదువుతున్నాడు. నా బిడ్డతో ఫోన్లో మాట్లాడిన.. అతడు చాలా భయపడుతున్నాడు. – పద్మనాభం