జవహర్‌నగర్, మార్చి 15 : ఆదివాసీలపై పారామిలటరీ బలగాల మారణహోమాన్ని ఆపాలని, అటవీ భూముల్లో సంపదను కొల్లగొట్టేందుకే కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాలు కొత్త నాటకానికి తెరలేపి అమాయక గిరిజనులను మావోయిస్టులుగా ముద్రవేసి మట్టుబెట్టడం దుర్మార్గమని, కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ కగార్‌ను వెంటనే విరమించుకోవాలని ఐఎఫ్టీయూ జాతీయ కన్వీనర్ షేక్ షావలి కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆపరేషన్ కగార్‌కు వ్యతిరేకంగా ప్రగతిశీల మహిళా సంఘం(పీవోడబ్ల్యూ విముక్తి) ఇచ్చిన పిలుపులో భాగంగా పెర్క సునీత ఆధ్వర్యంలో జవహర్‌నగర్ కార్పొరేషన్ శనివారం మహిళా దినోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా షేక్ షావలి హాజరై మాట్లాడుతూ.. సమాజంలో సగభాగమైన మహిళలు అసమానతలు, వివక్షతను నేటికి ఎదుర్కొంటున్నారని, మహిళలు సంఘటితంగా ఏకమై తమ హక్కులను తాము సాధించుకోవాలని పిలుపునిచ్చారు. కేంద్రంలోని బీజేపీ నరేంద్రమోదీ, అమిత్‌షాలు ఆదివాసీలపై కక్షకట్టి కేంద్ర బలగాలను ఉసిగోల్పుతున్నారని, ఆపరేషన్ కగార్‌ను ఎత్తివేసి దేశంలో శాంతియుత వాతావరణాన్ని నెలకోల్పేలా చొరవ తీసుకోవాలని పేర్కొన్నారు. దేశంలో మహిళపై దాడులు నిత్యం జరుగుతూనే ఉన్నాయని, శాంతిభద్రతలో ప్రభుత్వాలు కఠిన చర్యలు తీసుకుని మహిళలపై అరాచకాలను ఆపాలని తెలిపారు. అనంతరం మహిళలతో కలిసి అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని సంబురంగా జరిపారు. ఈ కార్యక్రమంలో పద్మ, యమునా, ఉమా తదితరులు పాల్గొన్నారు.