ఖైరతాబాద్: చేయని తప్పునకు నిమ్స్ కార్మికుడిని పోలీసులు చితకబాదారు. చివరకు తప్పు చేయలేదని నిర్ధారణ కావడంతో అతడిని నిర్లక్ష్యంగా ఆస్పత్రి గేటు ముందు పడేసి వెళ్లిపోయారు. ఈ అవమానీయ ఘటన పంజాగుట్ట పోలీసు స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసుల దెబ్బలకు నిమ్స్ గేటు ముందు సొమ్మసిల్లి పడిపోయిన బాధితుడిని తోటి కార్మికులు ఎమర్జెన్సీ వార్డులో చేర్చారు. నిమ్స్ కార్మికులు, కార్మిక సంఘాల నాయకులు తెలిపిన వివరాల ప్రకారం….దుండిగల్‌కు చెందిన రవికుమార్ నిమ్స్‌కు చికిత్స కోసం వచ్చాడు. వైద్యులు ఎంఆర్ఐ చేయించాలని సూచించగా, ఆ విభాగానికి వెళ్లి ఎంఆర్ఐ స్కానింగ్ కోసం సిద్ధమయ్యాడు. కానీ ఎంఆర్ఐ కోసం వచ్చే వారి వెంట తప్పనిసరిగా ఓ సహాయకుడు ఉండాలి.
అతడి వెంట ఎవరూ లేకపోవడంతో ఆ విభాగంలో పనిచేస్తున్న లింగయ్య అనే కార్మికుడికి సెల్‌ఫోన్, దుస్తులను ఇచ్చి స్కానింగ్ చేయించుకున్నాడు. స్కానింగ్ ముగిసిన తర్వాత బయటకు వచ్చిన రవికుమార్‌కు లింగయ్య దుస్తులు, సెల్‌ఫోన్‌ను అందించాడు. తన బంగారు గొలుసు కూడా ఇచ్చానని, దానిని కూడా ఇవ్వాలని కోరాడు. తనకు ఫోన్, దుస్తులు తప్ప.. ఎలాంటి ఆభరణం ఇవ్వలేదని చెప్పినా.. వినకుండా తన గొలుసు మాయం చేశాడంటూ గొడవకు దిగాడు. అంతటితో ఆగకుండా సెక్యూరిటీ కార్యాలయానికి చేరుకొని సెక్యూరిటీ అధికారికి విషయం చెప్పాడు.
తాను దొంగతనం చేయలేదని లింగయ్య చెప్పినా.. వినకుండా సదరు సెక్యూరిటీ ఆఫీసర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులకు దొంగతనం చేయలేదని లింగయ్య ఎంత చెప్పినా.. వినకుండా బలవంతంగా పోలీసు స్టేషన్‌కు తీసుకెళ్లారు. ఇక్కడ సీన్ కట్ చేస్తే…..గురువారం రాత్రి లింగయ్య నిమ్స్ మొదటి గేటు ముందు అపస్మారక స్థితిలో పడి ఉన్నాడు. గమనించిన సిబ్బంది ఎమర్జెన్సీ వార్డుకు తీసుకెళ్లారు. ఒంటి నిండా గాయాలతో ఉన్న లింగయ్య తనకు జరిగిన అన్యాయాన్ని తోటి కార్మికులకు చెప్పాడు. తాను దొంగతనం చేశానని రోగి రవికుమార్ నిమ్స్ సెక్యూరిటీ అధికారి రామారావుకు ఫిర్యాదు చేయడంతో తనను పోలీసులకు అప్పగించారని, పోలీసులు స్టేషన్లో తనను చితకబాదారన్నాడు.
చివరకు బంగారు గొలుసు ఆ రోగి జేబులోనే దొరకిందని నిర్ధారించుకొని తనను తీసుకువచ్చి గేటు ముందు పడేసిపోయారని వాపోయాడు. లింగయ్యపై చేయని దొంగతనం నిందమోపడంతో పాటు పోలీసులు చితకబాదడాన్ని ఖండిస్తూ కార్మికులు, కార్మిక సంఘాల నాయకులు ఎమర్జెన్సీ వార్డు వద్ద నిరసన తెలిపారు. డ్యూటీ ఆర్ఎంవో వచ్చి సమస్యను పై అధికారుల దృష్టికి తీసుకెళ్తానని, లింగయ్యకు న్యాయం జరిగే విధంగా చూస్తానని చెప్పడంతో నిరసన విరమించారు.
నిమ్స్ దవాఖానలో దొంగతనం జరిగిన విషయంపై ఎలాంటి సమాచారం లేదు. దొంగతనం వంటి ఘటనలు జరిగితే ముందుగా నాకు గాని, సూపరింటెండెంట్, ఆర్‌ఎంవోకు గాని ఫిర్యాదు చేయాలి. ఈ ఘటనపై నేను పోలీసులకు ఫిర్యాదు చేయలేదు. జరిగిన విషయాన్ని తెలుసుకొని పూర్తి స్థాయిలో విచారణ చేపడుతాం. విధుల్లో నిర్లక్ష్యం వహించడంతో పాటు నిజ నిజాలు తెలుసుకోకుండా కార్మికుడిపై తప్పుడు ఫిర్యాదు చేసి అతడిని ఇబ్బందులకు గురిచేసిందుకు సెక్యూరిటీ అధికారి రామారావుపై పోలీసులకు ఫిర్యాదు చేస్తాం. అతనిపై చర్యలు తీసుకుంటాం.
-డాక్టర్ నగరి బీరప్ప, నిమ్స్ డైరెక్టర్
నిమ్స్ దవాఖానలో బంగారు గొలుసు దొంగతనం జరిగినట్లు మాకు సమాచారం వచ్చింది. దుండిగల్‌కు చెందిన రోగి రవికుమార్, సెక్యూరిటీ అధికారి రామారావుతో కలిసి మాకు ఫిర్యాదు చేశారు. విచారణలో దొంగతనం జరుగలేదని తెలియడంతో లింగయ్యను వదిలేశాం.
– శోభన్, పంజాగుట్ట సీఐ
ఎలాంటి విచారణ చేపట్టకుండా చేయని దొంగతనానికి కార్మికుడు లింగయ్యను పోలీసు స్టేషన్‌కు తీసుకెళ్లి పోలీసులు చితకబాదడం హేయమైన చర్య. నిమ్స్‌లో దొంగతనం ఘటనలు జరిగితే ముందుగా సూపరింటెండెంట్, ఆర్ఎంవో దృష్టికి తీసుకెళ్లాల్సి ఉంటుంది. కానీ వారి దృష్టికి తీసుకెళ్లకుండానే సెక్యూరిటీ అధికారి రామారావు నేరుగా పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తప్పుడు ఫిర్యాదు చేసిన సెక్యూరిటీ అధికారితో పాటు నిర్ధారణ చేసుకోకుండానే అమాయక కార్మికుడిని చితకబాదిన పోలీసులపై చర్యలు తీసుకోవాలి. బాధితుడికి న్యాయం చేయాలి. లేనిపక్షంలో ఆందోళన ఉధృతం చేస్తాం.
-నిమ్స్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ యూనియన్ నేత వెంకటేశ్