సిటీబ్యూరో, సెప్టెంబర్ 1 (నమస్తే తెలంగాణ): తన కొడుకును చుద్దామని పాకిస్తాన్ నుంచి అడ్డదారిలో ఇండియాలోకి చొరబడ్డాడు. హైదరాబాద్‌లో భార్య, అత్తమామలతో కలిసి ఉన్నాడు. అతడి వివరాలు బయటకు రాకుండా ఏడాది కాలంగా ఇంట్లోనే ఉన్నాడు. సమాచారం సేకరించిన బహదూర్‌పురా పోలీసులు పాకిస్తాన్ వాసి ఫయాజ్ను అరెస్టు చేశారు. భారత్‌లో ఉన్న అత్తామామల ప్రోత్సాహంతోనే అడ్డదారుల్లో ఇండియాకు వచ్చినట్లు పోలీసుల విచారణలో తెలిపాడు. సౌత్‌జోన్ డీసీపీ సాయి చైతన్య శుక్రవారం విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు.
ఇక్కడే పరిచయం..
పాకిస్తాన్‌కు చెందిన ఫయాజ్ 2018లో షార్జాలోని సైఫ్జోన్ అనే సంస్థలో టైలర్‌గా పనిచేశాడు. అదే సమయంలో హైదరాబాద్ అసద్ బాబానగర్‌కు చెందిన నేహా ఫాతిమా షార్జాలో ఉంటూ టైలర్‌గా పనిచేసింది. ఈ క్రమంలోనే ఇద్దరి మద్య స్నేహం ఏర్పడి, ప్రేమగా మారింది. కొన్నాళ్లు సహజీవనం చేశారు. ఆమె గర్భవతి అని తేలడంతో 2020లో ఫాతిమా, ఫయాజ్ మహ్మద్ పెండ్లి చేసుకున్నారు. అదే ఏడాది నగరానికి వచ్చిన ఫాతిమా.. అసద్‌బాబానగర్‌లోని తన ఇంటిలో మగబిడ్డ (ఫైజాన్)కు జన్మనిచ్చింది. ఆ తర్వాత కొడుకును తన సవిత తల్లి వద్ద వదిలేసి.. తిరిగి షార్జాకు వెళ్లిపోయింది. అక్కడ ఫయాజ్, ఫాతిమా కలిసి ఉన్నారు.
అత్తామామల ప్రోత్సాహం..
గత ఏడాది ఆగస్టులో ఫాతిమా తిరిగి హైదరాబాద్‌కు రాగా, ఫయాజ్ పాకిస్తాన్‌కు వెళ్లిపోయాడు. ప్రస్తుతం వీరి కుమారుడు ఫైజన్‌కు మూడేండ్లు. కొడుకును చూడాలని ఉందంటూ.. ఫయాజ్ గత ఏడాది ఫాతిమా తల్లిదండ్రులతో చెప్పాడు. కొడుకును చూడటమే కాదు.. ఇక్కడే ఉండేందుకు ఏర్పాట్లు చేస్తామంటూ ఫయాజ్ను హైదరాబాద్‌కు రావాలని కోరారు.
కఠ్మాండులో బస..
గతేడాది అక్టోబర్‌లో టూరిస్ట్ వీసాపై నేపాల్ రాజధాని కఠ్మాండుకు ఫయాజ్ చేరుకున్నాడు. అప్పటికే కఠ్మాండుకు ఫాతిమా, ఆమె తల్లిదండ్రులు కొడుకును తీసుకొని వెళ్లి.. అక్కడ ఓ హోటల్లో బస చేశారు. 2022, నవంబర్ 12న అందరు కలుసుకున్నారు. వీరంతా ఉత్తర్‌ప్రదేశ్‌లో మహరాజ్‌గంజ్ జిల్లా సొనౌలి సరిహద్దు చెక్‌పోస్టు దాటారు. ఫయాజ్ చెక్‌పోస్టులో దొరకకుండా జాగ్రత్తలు తీసుకొని, అక్రమంగా అతడిని భారత్‌లోకి తీసుకొచ్చారు. రోడ్డు మార్గంలో హైదరాబాద్‌లోని ఇంటికి చేరుకున్నారు. కొంత కాలం అత్తామామలతో కలిసి ఉన్న ఫయాజ్ ఆ తర్వాత.. ఎన్‌ఎంగూడలో ఓ ఇంటిని అద్దెకు తీసుకొని కాపురం పెట్టాడు. ఫయాజ్ పాకిస్తాన్ నుంచి వచ్చే సమయంలో రూ. 5 లక్షల వరకు తీసుకొచ్చాడు. ఆ డబ్బును ఖర్చు చేస్తూ కుటుంబమంతా హాయిగా గడుపుతోంది. ఫయాజ్‌కు ఆధార్ కార్డు ఇప్పిస్తే.. ఇక్కడే ఉండి ఏదో ఓ పని చేసుకుంటాడని భావించిన అత్తామామలు అందుకు ప్లాన్ చేశారు. తన పేరు మహ్మద్ గౌస్ అంటూ మాదాపూర్‌లోని ఓ ఈ సేవ కేంద్రంలో గత మార్చి నెలలో ఆధార్ కార్డు కోసం ఫయాజ్ దరఖాస్తు చేసుకున్నాడు.
ఉద్యోగం వేటలో బయటకొస్తే..
ఈ క్రమంలోనే అతడు పాకిస్తాన్ నుంచి తెచ్చుకున్న డబ్బు అయిపోయింది. ఖర్చుల కోసం డబ్బు అవసరమై.. ఉద్యోగం వేటలో ఇంటి నుంచి బయటకు వచ్చాడు. కొత్త వ్యక్తి ఎవరని ఆరా తీయగా.. విషయం తెలుసుకున్న బంధువులు పోలీసులకు సమాచారమిచ్చారు. దీంతో బహదూర్‌పురా ఇన్స్పెక్టర్ డి.అనిల్‌కుమార్, డీఐ ఎన్. శ్రీశైలం బృందం ఫయాజ్ను పట్టుకున్నారు. దేశంలోకి అక్రమంగా చొరబాటు చట్టం కింద కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు. ఫయాజ్ సరిహద్దులు ఎలా దాటాడు.. అతడికి చెక్‌పోస్టులో ఎవరైనా సహకరించారా.. వారి పాత్రపై కూడా నగర పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సంబంధిత శాఖలకు లేఖలు రాస్తామని డీసీపీ తెలిపారు. ఇదిలాఉండగా.. ఫయాజ్ అత్తా మామలపై కూడా కేసు నమోదు చేశారు. వారు పరారీలో ఉన్నట్లు డీసీపీ తెలిపారు.