ఖైరతాబాద్, డిసెంబర్ 16 : భవన నిర్మాణాలు జరిగే చోట సెంట్రింగ్ స్టీలు దొంగతనాలు నగరంలో విచ్చలవిడిగా జరుగుతున్నాయని, తక్షణమే ప్రభుత్వం, పోలీసు యంత్రాంగం వాటిని అరికట్టాలని శ్రీ సిద్ధి వినాయక వెల్డింగ్ ఓనర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు పి. యాదగిరి కోరారు. సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ కరోనా సమయంలో చైనా భారత్‌కు స్టీలు ఎగముతిని నిలిపివేసిందని, ఫలితంగా 30 శాతానికి పైగా రేట్లు పెరిగాయన్నారు. ఫలితంగా అనేక మంది వ్యాపారులు తమ షాపులను మూసివేశారన్నారు.
అయితే భవన నిర్మాణాలు జరిగే చోట కొందరు ముఠాగా ఏర్పడి వాటి దొంగతనాలకు తెరలేపారన్నారు. ఎంతో ఖరీదైన సెంట్రింగ్ స్టీలును దొంతనం చేయడంతో పాటు మార్కెట్లో స్క్రాప్ ధరకు విక్రయిస్తున్నారని, దీంతో వాటిని విక్రయించే సంస్థలు లాభాలు లేక మూతపడుతున్నాయన్నారు.
ఎక్కువ శాతం రాత్రి వేళల్లో నంబరు ప్లేట్ లేని వాహనాలపై సంచరిస్తూ దొంగతనాలకు పాల్పడుతున్నారని, వాటిని బోలక్పూర్ మార్కెట్లో విక్రయిస్తున్నారని తమ దృష్టికి వచ్చిందన్నారు.
ఓ వైపు ప్రభుత్వ ఆదాయంతో పాటు జీఎస్టీకి గండికొడుతూ, మరో వైపు విక్రయదారులను రోడ్డున పడేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం స్పందించి తక్షణమే ఈ ముఠా కార్యకలాపాలపై అడ్డుకట్ట వేయాలని కోరారు. ఈ సమావేశంలో అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి జి. శ్రీనివాస్, ఉపాధక్షులు ఏఈ భాగ్యవంత్ వర్మ, డి. మునీష్, సహాయ కార్యదర్శి కె. రాజు, కోశాధికారి రమేశ్ గుప్తా తదితరులు పాల్గొన్నారు.