మేడ్చల్/మేడ్చల్‌రూరల్/ఘట్కేసర్/జవహర్‌నగర్ / శామీర్‌పేట, జూలై 26: వారం రోజులు పాటు కురుస్తున్న వర్షాల వల్ల చెరువులు మత్తడి దుంకి..అలుగు పారుతున్నాయి. మంగళవారం సాయంత్రం నుంచి బుధవారం ఉదయం వరకు నియోజకవర్గ వ్యాప్తంగా భారీ వర్షం కురిసింది. వర్షాలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. మేడ్చల్ పట్టణానికి వచ్చే ప్రజలకు నలు వైపులా ఉన్న వాగులు రోడ్డుపై నుంచి ప్రవహించడంతో రాకపోకలకు ఇబ్బందులు పడుతున్నారు. రైల్వే అండర్ బ్రిడ్జి కింద నీరు పెద్ద ఎత్తున చేరడంతో వాహనదారులు కంట్రీక్లబ్ నుంచి రాలేకపోయారు. మేడ్చల్ పెద్ద చెరువు అలుగు మరింత ఉధృతంగా ప్రవహిస్తుంది. విద్యా సంస్థలకు సెల వులు ప్రకటించడంతో పట్టణవాసులు మేడ్చల్ పెద్ద చెరువు వద్దకు చేరుకొని అలుగుపారుతున్న చెరువు వద్ద సెల్ఫీలు తీసుకుంటూ సందడి చేశారు.చెరువు నిండడంతో మున్సిపాలిటీ పాలకవర్గం ప్రమాదాలు జరుగకుం డా అలుగు వద్ద కంచెను ఏర్పాటు చేశారు. మేడ్చల్ మండలంలోని చెరువులు, కుంటలు నిండి పొంగి పొర్లుతున్నాయి. డబిల్పూర్, నూతన్‌కల్, సోమారం, రాయిలాపూర్, రావల్కోల్ తదితర గ్రామాల చెరువులు అలుగులు పారుతుండగా మిగిలిన చెరువులు నిండుకుండలా మారాయి.
జూలై మాసంలోనే చెరువులు అలుగులు పారడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. పోచారం, ఘట్కేసర్ మున్సిపాలిటీల్లోని చెరువులు, కుంట ల్లోకి వదర నీరు వచ్చి చేరుతుంది. పలు వార్డుల్లో లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. పోచారం మున్సిపాలిటీలోని పెరుమళ్ల కుంట, మీరాలం చెరువు, ఘట్కేసర్ మున్సిపాలిటీలో తెట్టేరు చెరువు, రావి చెరువు, చిన్న చెరువులోకి పైనుంచి వరద నీరు వచ్చి చేరుతుంది. వారం రోజులుగా కురుస్తున్న వర్షాలకు ప్రజలు ఇండ్ల నుంచి బయటకు వెళ్లలేని పరిస్థితి నెలకొంది. వరుసగా కురుస్తున్న వర్షాలతో జవహర్‌నగర్ ప్రధాన రహదారి ఛిద్రమైంది. కార్పొరేషన్‌లోని చెన్నాపురం కూడలిలో ఒకవైపు రోడ్డు పూర్తిగా కొట్టుకుపోయి గుంతగా మారింది. ఉమ్మడి శామీర్‌పేట మండలంలోని చెరువు లు, కుంటలు నిండుకుండలను తలపిస్తుండగా, తూంకుంట మున్సి పాలిటీలోని దేవర యాంజాల్ చెన్నారాయుడి చెరు వు, మందాయిపల్లిలో గుండ్లకుంట, లాల్‌గడి మలక్ పేటలోని మల్కచెరువులు అలుగు పారుతున్నాయి. దీంతో ప్రజలు, పర్యాటకులు ఉల్లా సంగా ఉత్సాహంగా గడిపారు.