సిటీబ్యూరో, సెప్టెంబర్ 23(నమస్తే తెలంగాణ): హైదరాబాద్ నగరంలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో తమ నివాస ప్రాంతాలు నీట మునుగుతున్నాయని, పలుచోట్ల నాలాలు ఆక్రమణలకు గురై వరద నీరు సాఫీగా వెళ్లడంలేదంటూ నగరంలోని పలువురు హైడ్రాకు ఫిర్యాదు చేశారు. మంగళవారం బుద్ధభవన్‌లోని హైడ్రా కార్యాలయంలో జరిగిన ‘ప్రజావాణి’ కార్యక్రమంలో మొత్తం 49 ఫిర్యాదులు రాగా, అందులో 30కి పైగా నాలా ఆక్రమణలు, వరద ముంపునకు సంబంధించినవేనని హైడ్రా ఓ ప్రకటనలో పేర్కొంది.
సంగారెడ్డి జిల్లా అమీన్పూర్లో బందంకొమ్మ చెరువు నాలాను డైవర్ట్ చేయడం వల్ల వరద సాఫీగా సాగక దాదాపు 8 కాలనీలు వరదతో ఇబ్బందులు పడుతున్నాయని స్థానికులు ఫిర్యాదు చేశారు. యూసుఫ్‌గూడ వద్ద ఉన్న కృష్ణనగర్‌లో మురుగు, వరదనీరు ముంచెత్తుతుందని, ఏ మాత్రం వర్షం పడినా బయటకు రావడానికి కష్టమవుతున్నదని స్థానికులు ఫిర్యాదు చేశారు.
రంగారెడ్డి జిల్లా హయత్‌నగర్ మండలం సాహెబ్‌నగర్ ఖలాన్ పరిసర ప్రాంతాల్లోని కాలనీలు సాగర్‌రోడ్డు నుంచి వచ్చే వరదతో నీట మునుగుతున్నాయని స్థానికులు హైడ్రాకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదులను కమిషనర్ రంగనాథ్ పరిశీలించి పరిష్కార బాధ్యతలు సంబంధిత అధికారులకు అప్పగించారు. కొన్నిచోట్లకు తాను వచ్చి పరిశీలిస్తామని రంగనాథ్ ఫిర్యాదుదారులకు తెలిపారు.