సిటీబ్యూరో, ఏప్రిల్ 10(నమస్తే తెలంగాణ): గోల్నాక సెక్షన్‌లోని ఓ ఇంట్లో మీటర్ రీడింగ్ తీయడానికి ఔట్ సోర్సింగ్ ఉద్యోగి వచ్చాడు. మీటర్ మార్చుకోవాలంటూ సూచించాడు. ఆ తర్వాత డిజిటల్ మీటర్ తెచ్చిపెట్టాడు. ఇందుకోసం తనకు రూ.1200 ఫోన్‌పే చేయాలని అడిగాడు. ఎందుకంటే చాయ్‌పానీ ఖర్చులన్నాడు. ఫోన్‌పేలో డబ్బులు తీసుకున్నాడు. మీటర్ తెచ్చిపెట్టి ఒక మీటర్ చేంజ్ పేరుతో ఉన్న డూప్లికేట్ రసీదు ఇచ్చాడు. దానిపై అసిస్టెంట్ ఇంజినీర్ ఆపరేషన్స్ అని ఉన్నచోట ఈ మీటర్ రీడరే సంతకం పెట్టి ఇచ్చాడు. ఇదంతా అంబర్‌పేట డివిజన్లో జరిగింది.
ఇలా ఆ ఒక్క ఏరియాలోనే ఎనిమిది మంది వద్ద రూ.1200 నుంచి రూ.1500 వసూలు చేశారని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఈ విషయంపై ఉన్నతాధికారులకు చెప్పినా తనకేం కాదని, ఇందులో వారికే పెద్ద వాటా ఉంటుందని ఆ ఔట్ సోర్సింగ్ ఉద్యోగి అంటున్నారని వారు పేర్కొన్నారు. మీటర్ ఛేంజ్ చేయాలంటే డబ్బులు చెల్లించాల్సిన అవసరం లేదని , ఎస్పీడీసీఎల్ ఉచితంగా మీటర్ మార్చాలని ఉన్నా.. ఈ విధంగా వసూలు చేయడం ఏంటని అంబర్‌పేట సెక్షన్ అధికారులకు చెప్పినా ఫలితం లేదని సదరు వినియోగదారుడు వాపోయాడు.
పాత మీటర్ల స్థానంలో డిజిటల్ మీటర్లు బిగిస్తున్న సిబ్బంది చేతివాటం ప్రదర్శిస్తున్నారంటూ అనేక ఫిర్యాదులున్నాయి. తమకు ఇచ్చే డబ్బుల్లో పై సిబ్బందికి కూడా వాటాలివ్వాలంటూ సదరు మీటరు బిగిస్తున్న సిబ్బందే చెబుతున్నారు. ఏఈలు సంతకం పెట్టి ఇవ్వాల్సిన రసీదును వీరే ఏకంగా సంతకాలు పెట్టి ఇస్తున్నారంటే దందా ఎంత బాహాటంగా నడుస్తుందో తెలుస్తోంది.