సిటీబ్యూరో, మార్చి 17 (నమస్తే తెలంగాణ) : తమ సమస్యలు పరిష్కరించాలని టీచర్లు కోరుతున్నారు. ఇష్టానుసారంగా బదిలీల పేరుతో వేధించడం, డబుల్ డ్యూటీలతో ఒత్తిడి తీసుకువస్తున్నారని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. పరీక్షల డ్యూటీలు, మూల్యాంకన పనులు చేయించుకుని జీతాలు కూడా ఇవ్వడం లేదని వాపోయారు. జిల్లాకు చెందిన టీచర్లు అందరూ ఉద్యమానికి సిద్ధమయ్యారు. మంగళవారం జిల్లా విద్యాశాఖ ఏడీకి వినతి పత్రం అందజేశారు. గతంలో కలెక్టర్‌కు వినతి పత్రం అందజేశామని తెలిపారు.
గతేడాది పదో తరగతి మూల్యాంకన డబ్బులను ఇప్పటి వరకు ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పుడు మళ్లీ మూల్యాంకన డ్యూటీల ప్రక్రియకు సిద్ధమవుతున్నారని చెప్పారు. తమ సమస్యలు పరిష్కరించకపోతే స్పాట్ కేంద్రాల వద్ద పెద్ద ఎత్తున నిరసన చేస్తామని హెచ్చరించారు. 2017 టీఆర్టీ ద్వారా నియామకం కాబడిన ఉపాధ్యాయుల రెగ్యులరైజేషన్ ప్రక్రియను వెంటనే పూర్తి చేయాలని కోరారు. ఎయిడెడ్ ఉపాధ్యాయుల జీతాల బిల్లుల చెల్లింపు జాప్యాన్ని నివారించాలన్నారు.
ప్రస్తుతం డిప్యూటేషన్‌పై విధులు నిర్వర్తిస్తున్న ఉపాధ్యాయులందరిని విద్యా సంవత్సరం చివరి పనిదినం ఏప్రిల్ 23న రిలీవ్ చేసి సొంత పాఠశాలలకు పంపించాలని డిమాండ్ చేశారు. అనారోగ్యంతో బాధపడుతున్న వారికి స్పాట్ డ్యూటీల నుంచి మినహాయించాలని కోరారు. కార్యక్రమంలో టీఎస్‌యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి విశాలి, జిల్లా అధ్యక్షుడు రాజారావు, ప్రధాన కార్యదర్శి శ్యాం సుందర్, కోశాధికారి కవిత, కార్యదర్శులు బాషా, వంశీ, రఘునాత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.