సిటీబ్యూరో, జూన్ 24 (నమస్తే తెలంగాణ): తొమ్మిదేండ్ల క్రితం ఏర్పడిన తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి దేశానికే రోల్‌మోడల్‌గా మారిందని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ వైస్ చాన్స్‌లర్ ప్రొఫెసర్ సీతారామారావు అన్నారు. దశాబ్ది వేడుకల సందర్భంగా ‘తెలంగాణ ఎదుగుదల కథ-సామూహిక చర్చ’ అనే అంశంపై శనివారం ఓపెన్ యూనివర్సిటీలో నిర్వహించిన కార్యక్రమంలో వీసీ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. జాతీయ స్థాయిలో 90 శాతానికి పైగా అభివృద్ధి అవార్డులు తెలంగాణకు రావడం ఎంతో విశేషమన్నారు. కొవిడ్ సమస్య, పెద్ద నోట్ల రద్దు వంటి పలు అంశాలు ఇబ్బందిగా మారినప్పటికీ తెలంగాణ అభివద్ధికి అవి పెద్ద ఆటంకంగా మారలేదన్నారు. సీఎం కేసీఆర్ దూరదృష్టి, వనరుల లభ్యతపై అవగాహన, ఆర్థిక క్రమ శిక్షణ, పేదలకు సంక్షేమం వంటి పథకాలు అందించడం వంటివి తెలంగాణను దేశంలోనే అగ్ర స్థానంలో నిలిపాయన్నారు. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన యూనివర్సిటీ అకడమిక్ డైరెక్టర్ ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి మాట్లాడుతూ అభివృద్ధి అనేది నిరంతర ప్రక్రియ అని, పాలకులు సమాజాభివృద్ధికి పాటుపడినప్పుడే సమగ్ర అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు.
దక్షణాది రాష్ర్టాల నుంచి పన్నుల ద్వారా వసూలు చేసిన ఆదాయం తిరిగి వచ్చేది కేవలం 49 శాతం మాత్రమే అని అన్నారు. ఇక్కడ ఆదాయాన్ని ఏ మాత్రం ఆర్థిక క్రమ శిక్షణ, కుటుంబ నియంత్రణ పాటించని ఉత్తరాది, ఈశాన్య రాష్ర్టాలకు తరలిస్తున్నారన్నారు. ఇలాంటి చర్య దక్షణాది రాష్ర్టాల ప్రజలకు శాపంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. రానున్న రోజుల్లో పార్లమెంట్ స్థానాల పునర్విభజన జరిగితే చట్ట సభల్లో దక్షణాది రాష్ర్టాల ప్రాతినిధ్యం పడిపోయే ప్రమాదం ఉందని అన్నారు. ప్యానెల్ సభ్యులుగా పాల్గొన్న సెస్ డైరెక్టర్ ప్రొఫెసర్ రేవతి మాట్లాడుతూ పెద్ద రాష్ర్టాల్లో జరగని అభివృద్ధి చిన్న రాష్ర్టాలతోనే సాధ్యం అనే వాదనను తెలంగాణ రాష్ట్రం సుసాధ్యం చేసి చూపించిందన్నారు. ఆయా రాష్ర్టాల్లో అమలయ్యే సంక్షేమ కార్యక్రమాల అమలుకు అయ్యే ఖర్చులో 60 శాతం కేటాయింపులు రాష్ర్టాలే భరిస్తాయన్నారు. కాళేశ్వరం లాంటి ప్రాజెక్టులు గ్రామీణ అభివృద్ధికి విరివిగా ఉపయోగపడుతున్నాయన్నారు. ఈ కార్యక్రమంలో ప్రొఫెసర్ చెన్న బసవయ్య, యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ అధ్యాపకులు ప్రొఫెసర్ ఆర్వీ రమణమూర్తి, ఈసీ సభ్యులు డాక్టర్ బానోత్ లాల్, సికా డైరెక్టర్ ప్రొఫెసర్ మధుసూదన్ రెడ్డి, ప్రొఫెసర్ గుంటి రవి, డీన్ ప్రొఫెసర్ షకీలా ఖానం, ప్రొఫెసర్ వడ్డానం శ్రీనివాస్, పరీక్షల నియంత్రణ అధికారి డాక్టర్ పరంకుశం వెంకటరమణ, విద్యా సేవల విభాగం డైరెక్టర్ డాక్టర్ ఎల్వీకే రెడ్డి, యూనివర్సిటీ అధ్యాపకులు, సిబ్బంది, ఉద్యోగులు పాల్గొన్నారు.
హైదరాబాద్, జూన్ 24 (నమస్తే తెలంగాణ): ఒమన్ దేశ రాజధాని మసట్లో దశాబ్ది ఉత్సవాలను భారత జాగృతి ఒమన్, బీఆర్ఎస్ ఎన్నారై సెల్ ఒమన్శాఖ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. మస్కట్ ఏరియాలోని రాయల్ దవాఖానలోని సెంట్రల్ బ్లడ్‌బ్యాంక్‌లో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ముందుగా తెలంగాణ అమర వీరులను స్మరించుకున్నారు. అనంతరం రక్తదాన శిబిరం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో భారత జాగృతి ఒమన్శాఖ అధ్యక్షుడు గుండు రాజేందర్ నేత, బీఆర్ఎస్ ఎన్ఆర్ఐ సెల్ ఒమన్ అధ్యక్షుడు ఈగపురి మహిపాల్‌రెడ్డి, భారత్ జాగృతి ఒమన్ కో కన్వీనర్ బైసింగరపు వినోద్ యాదవ్, బీఆర్ఎస్ ఒమన్ ప్రధాన కార్యదర్శులు గాంధారి నరేశ్, భాసర్‌రెడ్డి, ప్రొఫెసర్ డాక్టర్ రామరాజు, కరుణాకర్, కార్యదర్శులు సాయిరాజు తదితరులు పాల్గొన్నారు.