ఉస్మానియా యూనివర్సిటీ, జనవరి 9: ఆహారం నాణ్యతగా లేదంటూ ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు రోడ్డుపై ఆందోళనకు దిగారు. మానేరు హాస్టల్ విద్యార్థులు తమ వంట గిన్నెలతో సహా ఆర్ట్స్ కళాశాల ముందు ప్రధాన రోడ్డుపై బైఠాయించి, రాస్తారోకో చేపట్టారు. ఈ సందర్భంగా విద్యార్థులు మాట్లాడుతూ తమకు మెనూ ప్రకారం ఆహారం అందించాలని డిమాండ్ చేశారు. హాస్టల్లో టాయిలెట్స్ అధ్వానంగా మారాయని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని వాపోయారు. హాస్టల్లో తాగునీరు సైతం సరిగా అందుబాటులో ఉండడం లేదని మండిపడ్డారు.
రెండు రోజుల కిందట వండిన చికెన్‌లోని బొక్కలు గురువారం ఉదయం టిఫిన్‌లో దర్శనమిచ్చాయన్నారు. నాణ్యతలేని భోజనం అందిస్తూ ఓయూ అధికారులు తమ ఆరోగ్యాలతో చెలగాటమాడుతున్నారని దుయ్యబట్టారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి, సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు.