OU | ఉస్మానియా యూనివర్సిటీ: హెచ్సీయూ భూములను వేలం వేయాలన్న రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా ఓయూలో వివిధ విద్యార్థి సంఘాల నాయకులు భారీ నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఆర్ట్స్ కళాశాల ఆవరణలో నిరసన వ్యక్తం చేసిన అనంతరం ర్యాలీ తీస్తుండగా పోలీసులు అడ్డుకొని అదుపులోకి తీసుకున్నారు. వారిని వివిధ పోలీస్ స్టేషన్లకు తరలించారు.
ఈ సందర్భంగా బీఆర్ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్, ఉపాధ్యక్షుడు డాక్టర్ తుంగబాలు, ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షుడు మూర్తి, ఓయూ అధ్యక్షుడు ఉదయ్, కార్పొరేటర్ డాక్టర్ సామల హేమ, బీఆర్ఎస్ నాయకురాలు డాక్టర్ సత్యవతి తదితరులు మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని తీవ్రంగా ఖండించారు. తక్షణమే ప్రభుత్వం తన నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో అన్ని విద్యార్థి సంఘాలతో కలిసి రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమిస్తామని హెచ్చరించారు.
రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ నేతలు సంపద సృష్టించి పాలన సాగిస్తామని చెప్పి అధికారంలోకి వచ్చాక.. ప్రభుత్వ భూములను అమ్మకానికి పెట్టడం దుర్మార్గమన్నారు. గుంట భూమి కూడా అమ్మబోమని చెప్పిన గుంపు మేస్త్రీ ఇప్పుడు ఏకంగా నగర జీవవైవిద్యానికి ఆయువుపట్టుగా ఉన్న 400 ఎకరాల భూమి కబళించాలని చూస్తున్నారని ఎద్దేవా చేశారు. విద్యాలయాలే దేవాలయాలుగా భావించే తరుణంలో అలాంటి వర్సిటీ భూములు, భావితరాలకు అందించే సంపదను ఇలా అమ్మేస్తూ పోతే రేపటి తరానికి ఏమందిస్తారని ప్రశ్నించారు.
ఆ 400 ఎకరాలలో వన్య ప్రాణులు జీవిస్తున్నాయి అని, ఒకసారి ఆలోచించండని ప్రతిపక్షాలు, విద్యార్థులు కోరితే ఈ అహంకారపు ముఖ్యమంత్రి గుంట నక్కలు ఉన్నాయంటూ వెకిలి నవ్వులు, వెకిలి మాటలు మాట్లాడటం సిగ్గుచేటని ధ్వజమెత్తారు. రేవం త్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన మొ దలు ప్రజామోదయోగ్యమైన పనులు ఇప్పటి వరకు ఒక్కటి కూడా చేయలేదని దుయ్యబట్టారు. ఇన్ని రోజు లు మూసీ ప్రక్షాళన, హైడ్రా పేరుతో పేదల ఇళ్లను కూలగొట్టారని, ఇప్పుడు నోరులేని వన్యప్రాణుల నీడను చిదిమేయాలని చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
పాలన చేతకాని సీఎం వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉన్న కేరళ, గుజరాత్ రాష్ర్టాల్లో పర్యావరణం అంటూ గొంతు చించుకుంటున్న రాహుల్ తెలంగాణ విషయంలో స్పందించాలని డిమాండ్ చేశారు. హెచ్సీయూ పూర్వ విద్యార్థులైన భట్టి విక్రమార్క, శ్రీధర్ బాబు ఎందుకు నోరు మెదపడం లేదని ప్రశ్నించారు. విశ్వవిద్యాలయాల్లోకి పోలీసులను పంపి విద్యార్థులను భయబ్రాంతులకుగురి చేయడం తగదన్నారు. వివిధ విద్యార్థి సంఘా లనాయకులు లక్ష్మణ్, విజయ్ నవీన్, కిరణ్ గౌడ్, సు మంత్, దశరథ్, నాగేందర్, జంగయ్య, శ్రీమాన్, రమేష్ గౌడ్, శీను నాయక్, నరేష్ క్రాంతి, సత్య పాల్గొన్నారు.