ఉస్మానియా యూనివర్సిటీ, ఫిబ్రవరి 9 : ఎన్సీసీలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన ముగ్గురు విద్యార్థుల పట్ల కళాశాల ప్రిన్సిపాల్ తన ఉదారత చాటుకున్నారు. విద్యార్థులకు తన సొంత డబ్బులను చెక్కు రూపంలో అందజేసి వారికి తోడ్పాటు అందజేశారు. అలాగే వారిని సత్కరించి, జ్ఞాపికలను అందజేశారు.
76వ భారతీయ గణతంత్ర దినోత్సవం సందర్భంగా న్యూఢిల్లీలోని కర్తవ్యమార్గ్లో నిర్వహించిన కవాతులో ముగ్గురు ఎన్సీసీ క్యాడెట్స్ గీత, రమ, శ్రీధర్ పాల్గొన్నారు. వీరికి కాలేజీ ప్రిన్సిపల్ డాక్టర్ టి.గంగాధర్ ఒక్కొక్కరికీ రూ.5వేల చొప్పున తన సొంత డబ్బులను అందజేశారు. ఈ సందర్భంగా కాలేజీ ప్రిన్సిపల్ మాట్లాడుతూ.. ఎన్సీసీ క్యాడెట్స్ చిత్తశుద్ధి, నిబద్ధతలకు మారుపేరు అని, దేశసేవల్లో ఎల్లప్పుడూ ముందుంటారని తెలిపారు. విద్యార్థులు అన్ని రంగాలలో రాణించేలా తన వంతు సహకారం ఎల్లప్పుడూ అందజేస్తానని పేర్కొన్నారు .
నంబర్ వన్ తెలంగాణ ఎయిర్ ఎన్సీసీ కమాండింగ్ ఆఫీసర్ వింగ్ కమాండర్ ప్రశాంత్ సూర్య వంశీ మాట్లాడుతూ.. ఈ కళాశాలలో చదివిన విద్యార్థులు ఎంతో గొప్ప స్థానాలను అధిరోహించారని, మీరు కూడా ఆ బాటలో నడవాలని ఆకాంక్షించారు. నంబర్ త్రీ తెలంగాణ బెటాలియన్ కమాండింగ్ ఆఫీసర్ శరత్ మాట్లాడుతూ.. కళాశాల క్యాడేట్స్ కి అన్ని రకాల సదుపాయాలు కల్పిస్తూ, వారిని భారత త్రివిధ దళాలలో చేరే విధంగా ప్రోత్సహిస్తుందని ప్రశంసించారు.
అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ లెఫ్ట్నెంట్ కల్నల్ మంజిల్ శర్మ మాట్లాడుతూ.. ప్రతి ఒక్క ఎన్సీసీ క్యాడేట్ ఆర్మీలో చేరి సేవలో పాలుపంచుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కళాశాల ఎన్సీసీ ఆఫీసర్ డాక్టర్ వై మల్లారెడ్డి, అధ్యాపకులు, బోధనేతర సిబ్బంది, ఎన్సీసీ క్యాడేట్స్, విద్యార్థులు పాల్గొన్నారు.