సుల్తాన్‌బజార్: విద్యార్థినులను వేధించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఓయూ గర్ల్స్ హాస్టల్ మెస్ ఇన్చార్జి వినోద్‌ను సస్పెండ్ చేసినట్లు ప్రిన్సిపాల్ డాక్టర్ లోకపావని వెల్లడించారు. అంతకుముందు కోఠిలోని వీరనారి చాకలి ఐలమ్మ మహిళా విశ్వవిద్యాలయంలో విద్యార్థినులు ఆందోళన బాటపట్టారు. ఓయూ గర్ల్స్ హాస్టల్ మెస్ ఇన్చార్జి వినోద్‌ను తక్షణమే సస్పెండ్ చేయాలంటూ వర్సిటీ దర్బార్ హాల్ వీసీ చాంబర్ వద్ద విద్యార్థినులు, వివిధ విద్యార్థి సంఘాల నాయకులు నిరసన తెలిపారు.
కళాశాల నడుస్తున్న సమయంలో షూటింగ్‌లకు పర్మిషన్లు ఇవ్వడం ఏమిటని విద్యార్థి సంఘాల నాయకులు వీసీని ప్రశ్నించారు. విద్యార్థినులు తమకు మెస్ ఇన్చార్జితో సమస్య తలెత్తున్నదని వీసీకి, ప్రిన్సిపాల్‌కు ఫిర్యాదు చేసినా వెంటనే విద్యార్థినులు షీ టీమ్స్ ఫిర్యాదు వరకు వెళ్లేవారు కాదన్నారు. ఈ విషయమై ఆందోళన చేస్తున్న విద్యార్థినులను ఉద్దేశించి వర్సిటీ వీసీ ప్రొఫెసర్ సూర్య ధనుంజయ్ మాట్లాడుతూ వేధింపుల విషయం తన దృష్టికి రాలేదని, ఫిర్యాదు చేసిన విద్యార్థిని తన వద్దకు రాకుండా షీటీమ్స్‌కు ఫిర్యాదు చేయడమేంటన్నారు.
ఇటువంటి ఘటనలు భవిష్యత్‌లో పునరావృతం కాకుండా చూస్తామన్నారు. వర్సిటీలో సినిమా షూటింగ్‌లకు కేవలం డబ్బుల కోసమే అనుమతి ఇస్తున్నామని అన్నారు. కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ లోకపావని మాట్లాడుతూ మెస్ ఇన్చార్జి వినోద్‌ను సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించారు. విద్యార్థినులు అభధ్రతా భావానికి లోను కాకుండా ఇక మీదట పటిష్ఠ చర్యలు తీసుకుంటా మన్నారు. వర్సిటీలో, హాస్టల్లో పనిదినాల్లో సినిమా షూటింగ్‌లకు అనుమతి ఇవ్వమని ఆమె హామీ ఇచ్చారు.