ఉస్మానియా యూనివర్సిటీ: ఉస్మానియా యూనివర్సిటీలో ఎలాంటి ఆందోళనలు చేయకూడదని అధికారులు జారీ చేసిన సర్క్యులర్ కు వ్యతిరేకంగా ఓయూ విద్యార్థి సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో చేస్తున్న ఉద్యమం ఉధృతమైంది. దీనిపై ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరామ్ ను కలిసి వినతి పత్రం అందజేసిన విద్యార్థి నాయకులు ఓయూ ప్రధాన రహదారిపై రాస్తారోకో నిర్వహించారు.
ఆందోళన చేస్తున్న విద్యార్థి నేతలను పోలీసులు అదుపులోకి తీసుకొని వివిధ పోలీస్ స్టేషన్లకు తరలించారు. ఈ సందర్భంగా విద్యార్థి నేతలు మాట్లాడుతూ విద్యా రంగంలో సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఉస్మానియా యూనివర్సిటీలో సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఉద్యమాలు నిర్వహిస్తున్న విద్యార్థి పోరాటాలను అణిచివేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం నియమించిన ఓయూ వైస్ ఛాన్సలర్ ఎం.కుమార్ కుట్ర చేస్తున్నారని ధ్వజమెత్తారు.
ఓయూలో ఉద్యమాలను నిషేధిస్తూ విడుదల చేసిన సర్క్యులర్ ను తక్షణమే వాపస్ తీసుకోవాలి డిమాండ్ చేశారు. ఈ రాస్తారోకో సందర్భంగా అరెస్టయిన వారిలో వివిధ విద్యార్థి సంఘాల నాయకులు ఎస్.నాగేశ్వరావు, ఎన్.సుమంత్, జంగిలి దర్శన్, పెద్దమ్మ రమేశ్, జంగయ్య, మొగిలిపాక నవీన్, చేరాల వంశీ, రాజేశ్ నాయక్, మిథున్ ప్రసాద్, రామకృష్ణ, శివ, ఎం.వెంకటేశ్, ఎస్.అంజి తదితరులు పాల్గొన్నారు.