Osmania University | ఉస్మానియా యూనివర్సిటీ, అక్టోబర్ 4: శతాధిక వసంతాల ఉస్మానియా యూనివర్సిటీ పరువును దిగజార్చేలా అధికారులు ప్రవర్తిస్తున్నారు. నాలుగేండ్లుగా అధికారుల వైఖరిపై ఎన్నోసార్లు వివిధ ఆరోపణలు వెల్లువెత్తినప్పటికీ, వారిలో మాత్రం కొద్దిగా కూడా మార్పురాలేదు. తాజాగా, వర్సిటీ అధికారుల మరో లీల వెలుగుచూసింది. అధికారుల నిర్లక్ష్యం కారణంగా వర్సిటీ పరువు దిగజారడంతో పాటు విద్యార్థులు విద్యాసంవత్సరం నష్టపోవాల్సిన పరిస్థితి దాపురించింది.
సాధారణంగా ఏదైనా పరీక్షలు నిర్వహించే తేదీని పదిహేను రోజుల ముందే ప్రకటించి, సదరు నోటిఫికేషన్ను వెబ్సైట్లో ఉంచాల్సినప్పటికీ అధికారులు దానిని మరిచారు. దీంతో పరీక్షలు రాయాల్సిన విద్యార్థులకు పరీక్షలు ప్రారంభమైన సంగతి కూడా తెలియలేదు. ఎంకామ్ మొదటి సెమిస్టర్ బ్యాక్లాగ్, ఇంప్రూవ్మెంట్ (2022-2023 బ్యాచ్ మాత్రమే) పరీక్షలను ఈ నెల 1న నిర్వహించనున్నట్లు ఓయూ కంట్రోలర్ ఆఫ్ ది ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ రాములు గత నెల 26న నోటిఫికేషన్ విడుదల చేశారు. పరీక్షలు నిర్వహించబోయే తేదీకి కేవలం అయిదు రోజుల ముందుగా పరీక్షా తేదీలను నిర్ణయించిన ఘనత ఓయూ అధికారులకే దక్కింది. పరీక్షలు మొదలైన రెండు రోజుల తరువాత పరీక్షా తేదీలతో కూడిన నోటిఫికేషన్ను వెబ్సైట్లో ఉంచారు.