ఉస్మానియా యూనివర్సిటీ: రెండేండ్ల విరామం అనంతరం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఉస్మానియా యూనివర్సిటీ 84వ స్నాతకోత్సవ నిర్వహణ అధికారుల నిర్వాకంతో అభాసుపాలవుతున్నది. ఇస్రో చైర్మన్ డాక్టర్ వి. నారాయణన్ ముఖ్య అతిథిగా, చాన్స్‌లర్ హోదాలో రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఈ కార్యక్రమానికి హాజరవుతున్నారు.
ఈ నేపథ్యంలో అధికారులు మీడియా ప్రతినిధుల పాసుల జారీని తూతూ మంత్రంగా నిర్వహిస్తున్నారు. కేవలం పార్కింగ్ స్టిక్కర్‌తో కూడిన చిన్న ఆహ్వానపత్రాన్ని అందజేసి.. చేతులు దులుపుకొంటున్నారు. దీనిపై మీడియా ప్రతినిధులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గవర్నర్, ఇస్రో చైర్మన్ వంటి ప్రముఖుల సెక్యూరిటీ ఈ ఆహ్వానపత్రాలతో లోనికి వెళ్తే అనుమతిస్తారో లేదో అని మదనపడుతున్నారు. అధికారుల వైఖరిపై మండిపడుతున్నారు.
మొదటి నుంచీ మీడియాపై వివక్షే..
ప్రస్తుత వీసీ పదవీ బాధ్యతలు స్వీకరించిన అనంతరం మీడియాకు దూరంగా ఉంటున్నారు. సాధారణంగా టీజీ సీపీజీఈటీ, టీజీ సెట్, డిగ్రీ పరీక్షా ఫలితాలు, దూరవిద్య ప్రవేశాల నోటిఫికేషన్ విడుదల సమయాల్లో విలేకరుల సమావేశాలు నిర్వహించి, ఇతర విషయాలు సైతం ముచ్చటించడం పరిపాటి. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం నియమించిన వీసీ.. బాధ్యతలు స్వీకరించి పది నెలలు గడిచినా.. ఒక్కసారి కూడా మీడియా ముందుకు రాలేదు. సాక్షాత్తూ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ప్రత్యేక ప్రసంగ కార్యక్రమాన్ని నిర్వహించినా.. ఆ వివరాలను సైతం కేవలం పత్రికా ప్రకటన రూపంలో విడుదల చేశారు.
మీడియాకు మరీ మొహం చాటేయడం ఎందుకు అనుకున్నారో ఏమోకానీ స్నాతకోత్సవ వివరాలు వెల్లడించేందుకు మాత్రం బుధవారం విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. సమావేశం వివరాలను గ్రూప్‌లో వెల్లడించిన అధికారులు.. ప్రత్యేకంగా ఈ మెసేజ్‌ను వేరే వాట్సాప్ గ్రూప్‌లలో పంపించకూడదని నిబంధన విధించడంతో పాటు కేవలం స్నాతకోత్సవ వివరాలు మాత్రమే వీసీ వెల్లడిస్తారని ప్రత్యేకంగా సెలవిచ్చారు. మీడియా సమావేశంలో కూడా ఎవరైనా ప్రతినిధులు ప్రశ్నించాలనుకుంటే కేవలం స్నాతకోత్సవానికి సంబంధించిన ప్రశ్నలే అడగాలని షరతు విధించారు.