Osmania University | సికింద్రాబాద్, మే 24: ఓయూలో బీఏ, బీకాం, బీఎస్సీ, బీబీఏ, బీ.ఎస్.డబ్ల్యూ చదివి బ్యాక్‌లాగ్స్ ఉన్న విద్యార్థులకు వన్ టైం అవకాశం ఇస్తూ పరీక్షల విభాగం నిర్ణయం తీసుకుంది. 2000 నుంచి 2015 మధ్య చదివిన వారికి ఈ అవకాశం వర్తిస్తుందని కంట్రోలర్ కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది. ఇయర్ వైస్ స్కీమ్ కింద 2000 నుంచి 2015 మధ్య చదివి ఫెయిల్ అయిన విద్యార్థులు.. తిరిగి పరీక్షలు రాసేందుకు విద్యార్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవచ్చు. నిర్దేశిత రుసుం చెల్లించి జూలైలో జరిగే పరీక్షలకు హాజరు కావచ్చని తెలిపారు. విద్యార్థులు చదివిన కాలం చివరి సంవత్సరం సిలబస్ ప్రకారం పరీక్షలు నిర్వహించనున్నట్లు స్పష్టం చేశారు.
బ్యాక్ లాగ్ పరీక్షలు రాసే విద్యార్థులు జూన్ 19 వరకు ఎలాంటి ఆలస్య రుసుము లేకుండా ఫీజు చెల్లించవచ్చు. 500 ఆలస్య రుసుముతో జూన్ 20 నుంచి 24 వరకు పరీక్ష ఫీజు చెల్లించవచ్చు. ఆయా కళాశాలల నుంచి వచ్చే ఫీజులు కళాశాలల ద్వారా జూన్ 25 సాయంత్రం 5 గంటల వరకు ఓయూ పరీక్షల విభాగానికి ఆన్ లైన్ ద్వారా సమర్పించాలని కంట్రోలర్ కార్యాలయం స్పష్టం చేసింది. ఫీజు వివరాల కోసం www.osmania.ac.in లో చూడవచ్చు.