సుల్తాన్‌బజార్, సెప్టెంబర్ 6: ఉస్మానియా మెడికల్ కళాశాల అంటేనే ఒక బ్రాండ్, ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా హైదరాబాద్ అంటే ఉస్మానియా అనే ప్రత్యేక గుర్తింపు ఉందని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. కోఠిలోని ఉస్మానియా మెడికల్ కళాశాలలో వైద్య బాలుర, బాలికలకు వేర్వేరుగా నూతన హాస్టల్ బ్లాక్ భవనాలను రూ.103 కోట్ల నిధులతో నిర్మాణ పనులను ప్రారంభించేందుకు గాను శుక్రవారం భూమి పూజ, శంకుస్థాపన కార్యక్రమాలను నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మంత్రి దామోదర రాజ నర్సింహ, రాష్ట్ర రవాణ, బీసీ శాఖల మంత్రి పొన్నం ప్రభా కర్, రాజ్యసభ సభ్యులు అనిల్ కుమార్ యాదవ్, ఎమ్మెల్సీ బల్మూరు వెంకట్, కార్పొరేటర్ రాకేశ్ జైస్వాల్, హెల్త్ సెక్రటరీ క్రిస్టీనా చోంగ్తు, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ ఆర్వీ కర్ణన్, డీఎంఈ డాక్టర్ వాణి, డైరెక్టర్ పబ్లిక్ హెల్త్ డాక్టర్ రవీందర్ నాయక్, ఉస్మానియా మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ నరేంద్ర, టీజీఎంఎస్ఐడీసీ ఎమ్డీ హేమంత్ బోర్కాడే, ఛీప్ ఇంజనీర్ పి.దేవేందర్ కుమార్, సూపరింటెండెంట్ ఇంజనీర్ సురేందర్ రెడ్డిలతో కలిసి భూమి పూజ, శంకుస్థాపన కార్యక్రమాలను నిర్వహించారు.
అనంతరం మంత్రి దామోదర మాట్లాడుతూ, 30 ఏండ్లుగా పెండింగులో ఉన్న సమస్యలను పరిష్కరిస్తున్నామని అన్నారు. జూడాలకు కొన్నేండ్లుగా ైస్టెఫెండ్ నెలల తరబడి అందలేదు. ఈ సమస్యను తాము పరిష్కరించి ప్రతి నెల పదో తేదీలోపు వచ్చేలా చేయడం జరిగిందన్నారు. విద్య, వైద్యశాఖలు ఎంతో కాంప్లికేటెడ్తో కూడుకున్నవని అన్నారు. దేవాలయానికి ఎంత నమ్మకంతో వెళుతామో.. అంతే నమ్మకంతో వైద్యాలయానికి వెళుతామన్నారు.
ప్రభుత్వ దవాఖానాలలో నిష్ణాతులైన వైద్యులు ఉంటారనే ప్రగాఢ విశ్వాసం ప్రజలలో ఉందని అన్నారు. 30 ఏళ్ళ కిందట రాష్ట్ర సీఎం, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు ఎవరైనా ఉస్మానియా, గాంధీలోనే వైద్య చికిత్సలు పొందేవారని ఈ సందర్భంగా గుర్తు చేశారు. గోషామహల్లో 31 ఎకరాలలో రూ.2000 కోట్ల నిధులతో అత్యాధునిక సౌకర్యాలతో ఉస్మానియా భవనం నిర్మాణం చేపడుతుందన్నారు. రాష్ట్ర రవాణా, బీసీ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ మాట్లాడుతూ వైద్యోనారాయణో హరి అని వైద్యులు గౌరవించబ డుతారని అన్నారు. అనంతరం ఆడిటోరియంలో నిర్వహించిన కార్యక్రమంలో మంత్రు లు అధికారులు 284 మంది ల్యాబ్ టెక్నిషియన్లకు నియామక పత్రాలను అందజేశారు.