హైదరాబాద్: మూసీ నది పరివాహక (Musi River) ప్రాంతాల్లో ఉద్రిక్తత కొనసాగుతున్నది. ఆపరేషన్ మూసీ పేరుతో తమ ఇండ్లకు మార్కింగ్ చేయడంపై నివాసితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సర్వే చేయడానికి వస్తున్న అధికారులను అడ్డుకుంటున్నారు. మూసీ సుందరీకరణకోసం తమ బతుకులను ఛిద్రం చేస్తున్నారంటూ మండిపడితున్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనబాటపట్టారు. ఇందులో భాగంగా లంగర్‌హౌస్ పీఎస్ పరిధిలో మూసీ నిర్వాసితులు ధర్నాకు దిగారు. లంగర్‌హౌస్‌లోని డిఫెన్స్ కాలనీ వాసులు రింగు రోడ్డుపై ఆందోళన చేపట్టారు. ప్రభుత్వం తమకు అన్యాయం చేస్తున్నదని నిర్వాసితులు ఆరోపిస్తున్నారు. ముఖ్యమంతి రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా పెద్దపెట్టున నినాదాలు చేస్తున్నారు. దీంతో కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.
కాగా, దిల్సుఖ్నగర్ చైతన్యపురి, సత్యా నగర్, మారుతీ నగర్లో రెవెన్యూ అధికారులు సర్వే నిర్వహిస్తున్నారు. భారీ బందోబస్తు మధ్య ఇండ్లకు మార్కింగ్ చేస్తున్నారు. దీంతో స్థానికులు వారిని అడ్డుకుంటున్నారు. ఇక్కడి నుంచి ఎక్కడికీ వెళ్లేది లేదని, డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు తమకు అవసరం లేదని స్పష్టం చేస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డిపై ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. ప్రజాపాలన, ఇందిరమ్మ పాలన అంటే ఇదేనా అంటూ ప్రశ్నిస్తున్నారు. ప్రాణాలైనా ఇస్తాం కానీ, అక్కడి నుంచి వెళ్లే ప్రసక్తే లేదని తేల్చి చెబుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై శాపనార్థాలు పెడుతున్నారు. ఇక్కడ అందరం కాంగ్రెస్ వాళ్లమేనని, మార్పు మార్పు అని ఓట్లు వేస్తే రోడ్ల మీద పడ్డామని వాపోయారు. వైయస్ రాజశేఖర్ రెడ్డి ఎలా చనిపోయాడో రేవంత్ రెడ్డి కూడా అలా చనిపోతాడు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.