వెంగళరావునగర్, మార్చి 21 : బెట్టింగ్ బ్యాచ్ ను పోలీసులు కటకటాల వెనక్కి నెట్టారు. ఆన్లైన్లో యూ ట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసి బెట్టింగుల్లో లాభాలు అర్జించినట్లు ఫేక్ వీడియోలను క్రియేట్ చేసి అమాయకుల్ని ఆకర్షిస్తారు. ఈ బెట్టింగుల్లో లక్షలాది రూపాయలు కొల్లగొట్టే ఈ గ్యాంగ్‌ను ఎల్లారెడ్డి గూడలో సెంట్రల్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు, మధురానగర్ పోలీసులు కలిసి పట్టుకున్నారు.
పోలీసుల కథనం ప్రకారం.. ఉమ్మడి అదిలాబాద్ జిల్లాకు చెందిన సోనులే శ్రీకాంత్(28), గుర్లే హరీశ్(29), గుర్లే సతీశ్ ్(31) కుమార్, సోనులే తిరుపతి(29), ఆదె వినోద్(28) లు ఇంటర్మీడియట్ చదువుకునే రోజుల్లో కామన్ ఫ్రెండ్స్. వృత్తి రీత్యా కార్పెంటర్ పనులు చేసే వీరు ఎల్లారెడ్డిగూడ శ్రీ దివ్య ఎన్ క్లేవ్లో ఓ ఫ్లాట్ ను అద్దెకు తీసుకుని ఆన్లైన్ బెట్టింగ్, సట్టా, మట్కా దందా గ్యాంగ్ ను నిర్వహిస్తున్నారు.
వాట్సాప్, ఫేస్ బుక్ ఐడీలు క్రియేట్ చేసి ఆన్ లైన్ లో యూ ట్యూబ్ ఛానల్ ద్వారా బెట్టింగ్ లను ఆకర్షిస్తున్నారు. రిజిస్టేష్రన్ కోసం ఒక్కొక్కరి నుంచి వెయ్యి రూపాయలను కలెక్ట్ చేస్తారు. అమాయకులకు అత్యాశ చూపి బెట్టింగ్ దందాలోకి దింపుతారు. తొలుత చిన్న మొత్తంలో బెట్టింగ్ ఆడించి వారికి లాభాలు చూపుతారు. పెద్దమొత్తంలో బెట్టింగ్ డబ్బులు పెట్టగానే వారిని మోసం చేసి వారి డబ్బును కాజేస్తారు.
ఇలా లక్షలాది రూపాయలను బెట్టింగ్ రాయుళ్లు కొల్లగొట్టారు. విశ్వసనీయ సమాచారం అందుకున్న సెంట్రల్ జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు మెరుపుదాడులు నిర్వహించి ఐదుగురు నిందితులను అరెస్టు చేశారు. వీరి నుంచి రూ.1.50 లక్షలతో పాటు ట్యాబ్, మ్యాక్ బుక్,సట్టా, మట్కా చీటీలు, 18 సెల్ ఫోన్లు, రూ. 2,13 697 బెట్టింగ్ బ్యాంక్ అకౌంట్, 2 కలర్ ప్రింటర్లు స్వాధీనం చేసుకున్నారు. మధురానగర్ పోలీసులు కేసు నమోదు చేసుకుని నిందితులను రిమాండ్ కు తరలించారు.