మలక్పేట, డిసెంబర్ 11 : మలక్పేట మార్కెట్కు సోమవారం ఉల్లిగడ్డ పోటెత్తింది. రాష్ట్రంతోపాటు పొరుగు రాష్ర్టాలైన ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్రల నుంచి 212 లారీల్లో 28,890 క్వింటాళ్ల ఉల్లిగడ్డ మార్కెట్కు దిగుమతి కావడంతో మార్కెట్ యార్డులు నిండిపోగా, రహదారులపై పెద్ద ఎత్తున కుప్పలుగా పోసి క్రయ, విక్రయాలు నిర్వహించారు. దాంతో మార్కెట్లో ఎటు చూసినా ఎర్ర బంగారం కుప్పలే దర్శనమిచ్చాయి.
మహారాష్ట్రలో నిలిచిన ఎగుమతులు
మహారాష్ట్రలో ఉల్లి ఎగుమతులు నిలిచిపోయి పంటలు పాడయ్యే పరిస్థితులు నెలకొనడం, మహబూబ్ మాన్షన్ మార్కెట్లో ఉల్లిగడ్డకు మంచి ధరలు పలుకుతుండటంతో మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ర్టాల రైతులు పంటలను మలక్పేట మార్కెట్కు పెద్ద మొత్తంలో తీసుకువచ్చారు. సోమవారం మహారాష్ట్ర నుంచి 83 లారీలు, కర్ణాటక నుంచి 54 లారీల్లో 18,495 క్వింటాళ్లు, మహబూబ్నగర్ నుంచి 59 లారీల్లో 7,965 క్వింటాళ్లు, కర్నూల్ నుంచి 14 లారీల్లో 1890 క్వింటాళ్లు, నాఫేడ్ ద్వారా 540 క్వింటాళ్లు.. మొత్తం 28,890 క్వింటాళ్ల ఉల్లిగడ్డ మార్కెట్కు దిగుమతి అయింది.
మరోవైపు ఆదివారం మార్కెట్కు సెలవు దినం కావడం, మంగళవారం అమావాస్య రోజున కూడా మార్కెట్ బంద్ ఉండనుండటంతో రైతులు పెద్ద ఎత్తున సరుకును తెచ్చారని, ఇది కూడా మార్కెట్లో సాధారణ దిగుమతులకంటే ఎక్కువగా దిగుమతి అవడానికి ముఖ్య కారణమైందని మార్కెట్ ఉన్నతశ్రేణి కార్యదర్శి ఎం. దామోదర్ తెలిపారు.
క్వింటాలుకు రూ.4 వేలు
మాహారాష్ట్ర, కర్ణాటక రాష్ర్టాల మేలురకం(గ్రేడ్-1) ఉల్లిగడ్డ క్వింటాలకు గరిష్ఠంగా రూ.4 వేలు ధర పలుకగా, మధ్యరకం (గ్రేడ్-2) క్వింటాలుకు రూ.3,500, నాసి రకం క్వింటాలకు రూ.1,000 ధర పలికింది. మహబూబ్నగర్ గ్రేడ్-1 రకం ఉల్లిగడ్డ క్వింటాలుకు రూ.2,500, గ్రేడ్-2 రూ.2,200, నాసిరకం రూ.800, కర్నూలు ఉల్లిగడ్డ మేలు రకం రూ.2,400, మధ్యరకం రూ.2,000, నాసిరకం రూ.800లు పలికాయి.