సిటీబ్యూరో, మే 21(నమస్తే తెలంగాణ): నగరంలో జరిగే అగ్ని ప్రమాదాల్లో చాలా వరకు షార్ట్ సర్క్యూట్‌తోనే జరుగుతున్నాయని ప్రాథమికంగా అధికారులు అంచనా వేస్తున్నారు. భవనాల్లో వాడే విద్యుత్ పరికరాలు నాణ్యతగా లేకపోవడంతో ఈ ప్రమాదాలు జరుగుతున్నట్లుగా తెలుస్తున్నది. వేసవి కాలంలో గ్రేటర్లో ఒక్క నెలలో పదికి పైగా ప్రమాదాలు జరిగితే అగ్ని ప్రమాదాలపై నివేదిక ఇవ్వాల్సిన విద్యుత్ తనిఖీ శాఖ(సీఈఐజీ) పెద్దగా దృష్టి పెట్టడంలేదు.
రెండు మూడు ప్రమాదాలపై నివేదిక ఇచ్చి చేతులు దులుపేసుకుంటున్నారన్న విమర్శలు ఉన్నాయి. తనిఖీల్లో ఆలస్యం, అలసత్వం కారణంగా ప్రమాదాల నివారణకు కఠిన చర్యలు తీసుకోవాల్సిన అధికార యంత్రాంగం, ఘటనలు జరిగిన రెండు మూడురోజులు హడావుడి చేసి ఆ తర్వాత ఆ సంగతే మరిచిపోతున్నారు.
ఈ ప్రమాదాల్లో అధికంగా భవనాల్లో అంతర్గత వైరింగ్ సరిగా లేకపోవడం, లోడ్‌కు మించిన విద్యుత్ వినియోగంతో జరుగుతున్నట్లుగా అధికారులు చెప్పారు. గుల్జార్‌హౌస్ వద్ద జరిగిన అగ్ని ప్రమాదానికి కూడా ఇవే ప్రాథమిక కారణాలుగా సిబ్బంది చెప్పారు. స్తంభాల వద్ద కుప్పలుగా ఉన్న వైర్లు, చేతికి అందే ఎత్తులో ఉండటం, ప్రతి భవనంలో వినియోగించే విద్యుత్ కంటే అధిక లోడ్ ఉండటంతో అగ్ని ప్రమాద ఘటన చుట్టు పక్కల ఉన్న షాపులన్ని ఇవే తరహాలో ఉన్నాయి. విద్యుత్ శాఖ క్షేత్రస్థాయి సిబ్బందిని అప్రమత్తం చేసి ఆ ప్రాంతంలో ఉన్న కనెక్షన్లు, అక్రమంగా తీసుకుంటున్న లోడ్‌పై వివరాలు కావాలని కోరినట్లు తెలిసింది.
తనిఖీల్లో విఫలం..!
గ్రేటర్ హైదరాబాద్ కేంద్రంగా ఎస్పీడీసీఎల్ పరిధిలో 60 లక్షల విద్యుత్ కనెక్షన్లు ఉన్నాయి. హైదరాబాద్ సెంట్రల్ పరిధిలోకి వచ్చే సుమారు ఏడు లక్షల కనెక్షన్లు ఉన్నాయి. సరైన సమయంలో నివేదికలు ఇవ్వకపోగా.. ప్రమాదాల నియంత్రణలో కీలకమైన విద్యుత్ తనిఖీ శాఖ పూర్తిగా విఫలమైందని ఆ శాఖ ఉన్నతాధికారి ఒకరు చెప్పారు. ముఖ్యంగా సీఈఐజీకి సంబంధించి ముఖ్య అధికారులు లేకపోవడం, ఒక్కరికే పలు రకాల బాధ్యతలు ఉండటంతో అసలు పట్టింపే లేకుండా పోతుందని పేర్కొన్నారు.
ముఖ్యంగా విద్యుత్ పరికరాల నాణ్యత, కేబుల్స్ వినియోగం, అంతర్గత విద్యుత్ లైన్లు, ఏబీ స్విచ్‌లు, ఎర్తింగ్ సిస్టమ్ వంటివి పక్కాగా ఉన్నయా?లేవా చూడాలి. క్షేత్రస్థాయిలో లైన్ ఇన్స్పెక్టర్లు వీటిపై దృష్టి పెట్టకపోవడం వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయి. భవనాల్లో లెక్కకు మించి ఏసీల వినియోగం విద్యుత్ ప్రమాదాలకు కారణమవుతున్నది. గుల్జార్‌హౌస్ వద్ద జరిగిన అగ్ని ప్రమాదంలో 14 ఏసీలు వాడటం, వీటిలో ఏసీ కంప్రెషర్ పేలిపోవడం వల్ల ప్రమాదం జరిగినట్లుగా అధికారులు చెప్పారు. పాతబస్తీ అగ్ని ప్రమాదానికి కారణమేంటనే దిశగా పోలీసుల దర్యాప్తు కొనసాగుతున్నది.