ఆక్రమణదారుల గుండెల్లో ‘హైడ్రా’ దడ పుట్టిస్తున్నది. నిబంధనలకు విరుద్ధంగా నిర్మిస్తున్న భవనాలను నేలమట్టం చేస్తున్నది. తాజాగా నగరానికితాగునీరు అందించే గండిపేట జలాశయం ఎఫ్టీఎల్లో అడ్డగోలుగా వెలిసిన అక్రమ నిర్మాణాలపై ఉక్కుపాదం మోపింది. భారీ పోలీసు బందోబస్తు నడుమ అధికారులు ఆక్రమణలను కూల్చివేశారు.
– మణికొండ/ మొయినాబాద్, ఆగస్టు 18
HYDRA | వారం రోజులుగా హైడ్రా అధికారులు గండిపేట చెరువు సమీపంలోని ఖానాపూర్ గ్రామ రెవెన్యూ పరిధిలో పర్యటించి.. దాదాపు పది అక్రమ నిర్మాణాలను గుర్తించారు. నిర్మాణదారులకు ముందస్తుగా నోటీసులు జారీ చేసినా.. వారి నుంచి నిర్దేశించిన సమయంలో ఎలాంటి సమాధానం రాకపోవడంతో ఆదివారం రెండు అక్రమ నిర్మాణాలను నేలమట్టం చేసినట్లు అధికారులు వెల్లడించారు. గండిపేట జలాశయం ఎఫ్టీఎల్ చిలుకూరు, అప్పోజిగూడ గ్రామ పంచాయతీ రెవెన్యూను ఆనుకుని ఉంటుంది.
ఓ రియల్ వ్యాపారి గండిపేట జలాశయం ఎఫ్టీఎల్ను కలుపుకొని వెస్ట్ సైడ్ అనే వెంచర్‌ను చేయగా, కొందరు బడాబాబులు ఎఫ్టీఎల్ పరిధిలో ప్లాట్లు కొనుగోలు చేసి.. దర్జాగా లేక్ వ్యూవ్తో పాటు గచ్చిబౌలి, ఫైనాన్సియల్ డిస్ట్రిక్ట్ భవన అంతస్తుల వ్యూ కనిపించే విధంగా ఎఫ్టీఎల్లో అక్రమంగా నిర్మాణాలు చేపట్టారు.
ఈ క్రమంలో అధికారులు సర్వే చేయగా, అప్పోజిగూడ గ్రామ పంచాయతీ పరిధిలో మూడు భవనాలు, చిలుకూరు గ్రామ పంచాయతీ పరిధిలో ఒక నిర్మాణం అక్రమంగా నిర్మించినట్లు గుర్తించారు. అధికారులు పూర్తి స్థాయిలో నివేదికను హైడ్రాకు నివేదించారు. ఈ క్రమంలో హైడ్రా ఆదివారం ఎఫ్టీఎల్ పరిధిలో అక్రమ నిర్మాణాల కూల్చివేతలకు శ్రీకారం చుట్టింది. హైడ్రా అధికారులు మల్లికార్జున్, చరణ్‌తో పాటు హెచ్ఎంఎస్ఎస్బీ డీజీఎం నరహరి, జలమండలి విజిలెన్స్ అధికారి లక్ష్మీరెడ్డి, స్థానిక సీఐ పవన్‌కుమార్‌రెడ్డి భారీగా పోలీసు బలగాలతో కూల్చివేతలకు వచ్చారు.
ఉదయం 11 గంటలకు నుంచి సాయంత్రం 6 గంటల వరకు కూల్చివేతల పర్వం కొనసాగింది. అప్పోజిగూడ గ్రామ పంచాయతీ పరిధిలోని మూడు భవనాలను, చిలుకూరు గ్రామ పంచాయతీ పరిధిలోని ఒక నిర్మాణాన్ని నేలమట్టం చేశారు. దేవలం వెంకటాపూర్ గ్రామ సమీపంలోని గండిపేట జలాశయం ఎఫ్టీఎల్ పరిధిలో అక్రమ నిర్మాణాన్ని సైతం కూల్చి వేశారు. యజమానులు అధికారులను అడ్డుకునే ప్రయత్నం చేశారు. అయినా వెనకడగు వేయకుండా అధికారులు అక్రమ నిర్మాణాలను తొలగించారు.