KTR | మాదాపూర్, జూన్ 13: మానసిక ఆరోగ్యానికి వన్ స్టాప్ వన్ సొల్యూషన్ సరైన మార్గమని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. హైదరాబాద్ మాదాపూర్‌లో అమృత సంకల్ప్ పేరుతో ఏర్పాటు చేసిన క్లినిక్‌ను ఆయన ప్రారంభించారు.
ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. మానసిక అనారోగ్యాన్ని కేవలం అనారోగ్య సమస్యగా మాత్రమే కాదని, వెల్నెస్ లెన్స్ ద్వారా కూడా చూడాలని అన్నారు. ఈ మార్పునకు నాయకత్వం వహించడానికి డాక్టర్ సురేంద్ర ముందుకు రావడం ప్రశంసనీయమని కొనియాడారు. దీర్ఘకాలిక భావోద్వేగ స్థితిస్థాపకతను పెంపొందించడంతో పాటు మానసిక అనారోగ్యానికి చికిత్స చేసే క్లినిక్ యొక్క సమగ్ర విధానాన్ని ఆయన ప్రశంసించారు. మీ క్లినిక్ పిల్లలు, పెద్దలు, వృద్ధులకు క్రమబద్ధమైన సంరక్షణను అందిస్తుందని పేర్కొన్నారు. దీంతో ఒత్తిడి, ఆందోళన, నిరాశ, సంబంధ సమస్యలు, ఓసీడీ, వ్యసనంతో పాటు మరింత తీవ్రమైన పరిస్థితులతో సహా విస్తృతశ్రేణి సమస్యలను పరిష్కరిస్తుందని అన్నారు. మానసిక ఆరోగ్యం శారీరక ఆరోగ్యంతో పాటు ముఖ్యమైనదని కేటీఆర్ అన్నారు.
‘ ఒక మంచి ఆలోచనతో డాక్టర్ సురేంద్ర, శిరీష, విజయలక్ష్మి కలిసి మాదాపూర్‌లో ఈ క్లినిక్‌ను ఏర్పాటు చేశారు. వారిని హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. ప్రస్తుతం ఉన్న జీవనశైలి వల్ల శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ఆరోగ్యం కూడా అత్యంత ముఖ్యమైనదిగా ప్రపంచవ్యాప్తంగా గుర్తించబడుతోంది. కేవలం శారీరక బాధలు మాత్రమే కాకుండా, మానసిక రుగ్మతలు, సమస్యల విషయంలో కూడా ప్రజలు అవసరమైన వైద్యుల సహాయాన్ని పొందాల్సిన అవసరం ఉంది. ఇలాంటి సందర్భంలో ఈ రోజు ప్రారంభించిన ఈ తరహా సౌకర్యాలు అందరికీ ఎంతో ఉపయోగకరంగా ఉంటాయి. అనేక మానసిక సమస్యలను తల్లిదండ్రులకు, స్నేహితులకు చెప్పుకునే పరిస్థితి లేకపోవడం వల్ల… మానసిక నిపుణులు, మానసిక వైద్యుల సహకారంతో స్వాంతన పొందే అవకాశం కలుగుతుంది. మానసిక సమస్యలకు చికిత్స తీసుకోవడం అనేది అవమానకరం కాదనే విషయాన్ని సమాజం అర్థం చేసుకోవాలి. దీనిపై ఉన్న నెగటివ్ అభిప్రాయం మారాల్సిన అవసరం ఉంది.’ అని కేటీఆర్ అన్నారు. మానసిక సమస్యల కారణంగా చాలామంది ఆత్మహత్య లాంటి తీవ్రమైన నిర్ణయాలు తీసుకుంటున్నారని.. ప్రాణం కోల్పోవడం కంటే మానసిక చికిత్స తీసుకోవడం ఎంతో సులభమనీ విషయం ప్రతి ఒక్కరూ గ్రహించాలని సూచించారు. దేశంలో అనేక మందిని బాధిస్తున్న షుగర్ వ్యాధికి ప్రధాన కారణం ఒత్తిడి అనే విషయం చాలామందికి తెలియదని… ఈ తరహా మానసిక ఒత్తిడిని తగ్గించేందుకు ఇలాంటి క్లినిక్‌లు ఎంతగానో ఉపయోగపడతాయని అభిప్రాయపడ్డారు.
అమృత సంకల్ప్ మానసిక శ్రేయస్సుకు ప్రాధాన్యత ఇవ్వడం, సమాజానికి తిరిగి ఇవ్వడం నా మార్గం అని డాక్టర్ సురేంద్ర అన్నారు. అమృత సంకల్ప్‌ను ప్రత్యేకంగా నిలబెట్టేది 360 డిగ్రీల మోడల్ సంరక్షణని చెప్పారు. టెక్ ఎనేబుల్డ్ మెంటల్ హెల్త్ కంపెనీ అయినా అవికతో కలిసి క్లినిక్ వర్చువల్ రియాలిటీ ఆధార్ చికిత్స, టెలి థెరఫీ, యాప్ ఆధారిత ఫాలో అప్ లు, నిపుణులచే రూపొందించబడిన కష్టమైజ్డ్ థెరఫీ ప్లాన్లను అందిస్తుందని పేర్కొన్నారు. అమృత సంకల్ప్ అనేది కేవలం ఒక క్లినిక్ మాత్రమే కాదని, మానసిక ఆరోగ్యాన్ని ఎలా అర్థం చేసుకోవాలి, ఎలా పరిష్కరించాలి అనే దానిని పునర్నిర్మించడానికి ఇది ఒక ఉద్యమం అని తెలియజేశారు.