కుత్బుల్లాపూర్, డిసెంబర్ 1: పాతకక్షలతో వ్యక్తి దారుణ హత్యకు గురైన ఘటన పేట్బషీరాబాద్లో సోమవారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ప్రకాశం జిల్లా చీరాల ప్రాంతానికి చెందిన జగదీశ్వర్‌రెడ్డి(26)నగరానికి వలస వచ్చి సూరారంలో తన తల్లిదండ్రులతో కలిసి ఉంటూ కూలీ పనులు చేసుకుంటున్నాడు. సుభాష్‌నగర్‌లో ఉంటున్న సోయల్ అనే వ్యక్తితోపాటు మరి కొంతమందితో జగదీశ్వర్‌రెడ్డి స్నేహంగా ఉండేవాడు. కాగా సోయల్ వ్యక్తిగత విషయంలో జగదీశ్వర్‌రెడ్డి తలదూర్చడంతో గతంలో వీరి మధ్య గొడవలు జరిగాయి.
దీంతో జగదీశ్వర్‌రెడ్డిని చంపాలని సోయల్ నిర్ణయించుకున్నాడు. పథకం ప్రకారం.. ఆదివారం రాత్రి సోయల్ మరో వ్యక్తితో కలిసి సుభాష్‌నగర్ ఫాక్స్‌సాగర్ చెరువు కట్ట వద్దకు వెళ్లారు. మద్యం సేవిద్దామని జగదీశ్వర్‌రెడ్డికి ఫోన్ చేసి పిలిపించుకున్నారు. మద్యం తాగిన తర్వాత సోయల్, జగదీశ్వర్‌రెడ్డిల మధ్య మాటమాట పెరిగి ఘర్షణకు దారితీయడంతో సోయల్ కత్తితో జగదీశ్వర్‌రెడ్డిని పలుమార్లు పొడిచి హత్య చేశారు. అనంతరం పేట్ బషీరాబాద్ పోలీస్‌స్టేషన్‌లో సోయల్ లొంగిపొయాడు. పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. సోయల్పై గతంలో పలు కేసులు ఉండడంతోపాటు పరారీలో ఉన్న మరో ఇద్దరు నిందితులైన అజయ్, బిహార్ ప్రాంతానికి చెందిన కుందన్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.