దుండిగల్, జూలై 14: కారు ఢీకొట్టిన ఘటనలో ద్విచక్రవాహనదారుడు మృతి చెందగా, మరొకరికి గాయాలయ్యాయి. ఈ సంఘటన దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆదివారం చోటుచేసుకున్నది. పోలీసుల కథనం ప్రకారం… సంగారెడ్డి జిల్లా, గుమ్మడిదల మండలం, దోమడుగు గ్రామానికి చెందిన టి .రాజు గౌడ్ (35)కు భార్యా పిల్లలు ఉన్నారు. అదే జిల్లా జిన్నారం మండలం, మంత్రికుంట గ్రామానికి చెందిన పోచయ్య అతడికి స్నేహితుడు. ఈ నేపథ్యంలో ఈనెల 13న ఉదయం షాపింగ్ చేసేందుకు రాజు గౌడ్, పోచయ్యలు ద్విచక్ర వాహనంపై సికింద్రాబాద్ వెళ్లారు. షాపింగ్ ముగించుకొని సాయంత్రం తిరుగు ప్రయాణమయ్యారు.
ఈ క్రమంలో బైక్ దుండిగల్ మున్సిపాలిటీ పరిధిలోని సారే గూడెం దాటి దుండిగల్ వైపు వెళ్తుండగా భారత్ పెట్రోల్ బంకు వద్ద వేగంగా దూసుకు వచ్చిన కారు (హెచ్ఆర్ 26 బీసీ 7830) బైక్ను ఢీ కొట్టి వెళ్లిపోయింది. ఈ ప్రమాదంలో బైక్పై నుంచి రాజు గౌడ్ ,పోచయ్యలు రోడ్డుపై పడడంతో రాజు గౌడ్ తీవ్ర గాయాలతో అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. పోచయ్య గాయాలతో బయటపడ్డాడు. మృతుడి భార్య లావణ్య సోమవారం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.