బండ్లగూడ మే 14: రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్లో ఓ వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతిచెందడం స్థానికంగా కలకలం సృష్టించింది. పోలీసులు కొట్టడం వల్లనే బాధితుడు ఠాణా నుంచి బయటకు వచ్చి వాంతులు చేసుకుని అక్కడికక్కడే కుప్పకూలి మృతిచెందినట్లు కుటుంబ సభ్యులు ఆరోపిస్తుంటే.. కాగా గుండెనొప్పి వల్లనే సదరు వ్యక్తి మృతిచెందినట్లు పోలీసులు చెబుతున్నారు. పోలీసులు, మృతుడి కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. కర్ణాటకలోని మైసూర్ ప్రాంతానికి చెందిన ఇర్ఫాన్ (35) మొదటి భార్యకు విడాకులు ఇచ్చాడు. అనంతరం నగరానికి వలస వచ్చి.. బండ్లగూడ జాగిర్‌లోని ఖలీజ్ ఖాన్ ప్రాంతంలో ఆటో నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. కొంతకాలం తర్వాత ఇర్ఫాన్ నిషాద బేగం అనే యువతిని రెండో వివాహం చేసుకున్నాడు. వీరికి ముగ్గురు సంతానం.
ఇదిలా ఉండగా వారి ఇంటిపక్కనే నివాసం ఉంటున్న వివాహితతో పరిచయం పెంచుకున్న ఇర్ఫాన్ ఆమెను కూడా వివాహం చేసుకునేందుకు యత్నించాడు. ఈ విషయం తెలుసుకున్న నిషాద.. ఇర్ఫాన్‌ను నిలదీసింది. ఈ మూడోపెళ్లి విషయంలో తలెత్తిన వివాదంతో ఇరు కుటుంబ సభ్యులు గొడవపడి, అదేరోజు రాత్రి పోలీసులను ఆశ్రయించారు. ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు ఇర్ఫాన్‌కు కౌన్సెలింగ్ నిర్వహించారు. అనంతరం ఇరువర్గాల వారు రాజీ కుదుర్చుకొని అంగీకార పత్రం రాసుకున్నారు. పోలీస్ స్టేషన్ నుంచి బయటకు వచ్చిన ఇర్ఫాన్ ఒక్కసారిగా ఠాణా ఆవరణలోనే కుప్పకూలిపోయాడు. కుటుంబ సభ్యులు వెంటనే బాధితుడిని స్థానిక ప్రైవేటు దవాఖానకు తరలించగా ఉస్మానియాకు తీసుకెళ్లాలని అక్కడి వైద్యులు సూచించారు. దీంతో బాధితుడిని ఉస్మానియాకు తరలించగా అప్పటికే అతడు మృతిచెందినట్లు వైద్యులు ధృవీకరించారు.
ఇర్ఫాన్‌ను పోలీసులు కొట్టడంతోనే మృతి చెందాడని అతడి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. పీఎస్‌కు వెళ్లిన సమయంలో పోలీసులు కొట్టిన దెబ్బలకు తాళలేక ఇర్ఫాన్ పెట్టిన కేకలు స్టేషన్ బయట రోడ్డు వరకు వినిపించాయని.. పోలీసుల దెబ్బలకు ఇర్ఫాన్ బయటకు పరిగెత్తుకొచ్చి రెండుసార్లు వాంతులు చేసుకున్నాడని మృతుడి సోదరుడు వెల్లడించాడు. చివరికి పోలీసు స్టేషన్ ఆవరణలోనే ఇర్ఫాన్ కుప్పకూలిపోయినా పోలీసులు హాస్పిటల్‌కు కూడా తీసుకెళ్లలేదని ఇర్ఫాన్ బంధువులు ఆరోపిస్తున్నారు.
జరిగిన ఘటనపై విచారణ జరిపించాం. స్టేషన్‌లోని సీసీ కెమెరాలను పరిశీలించాం. ఇర్ఫాన్‌ను పోలీసులు కొట్టడం వల్లనే మృతిచెందాడని అతడి కుటుంబ సభ్యులు చేస్తున్న ఆరోపణల్లో వాస్తవం లేదు. వారు స్టేషన్‌కు వచ్చే ముందే ఇంటివద్ద గొడవ పడ్డారు. ఇంటి యజమాని వారించి, పీఎస్‌కు వెళ్లాలని చెప్పడంతో మంగళవారం రాత్రి 9గంటల సమయంలో స్టేషన్‌కు వచ్చారు. దీంతో ఇరు కుటుంబ సభ్యులకు అక్కడి సిబ్బంది కౌన్సిలింగ్ ఇచ్చి, పంపించారు. పీఎస్ నుంచి ఇంటికి వెళ్లే సమయంలో ఇర్ఫాన్ అనారోగ్యం కారణంగా అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. వెంటనే బాధితుడిని చికిత్స నిమిత్తం ఆటోలో ఉస్మానియాకు తరలించగా అప్పటికే అతను మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు. దీనిపై బీఎన్ఎస్ఎస్ సెక్షన్ 194కింద కేసు నమోదు చేశాం.
– చింతమనేని శ్రీనివాస్, డీసీపీ, రాజేంద్రనగర్