శంషాబాద్ రూరల్, నవంబర్ 16: రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందిన ఘటన శుక్రవారం రాత్రి జరిగింది. పోలీసులు తెలిపిన ప్రకారం.. శంషాబాద్ పట్టణంలోని ఫ్లైఓవర్‌పై ప్రమాదం జరిగినట్లు సమాచారం అందడంతో వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు తీవ్ర గాయాలైన వ్యక్తిని పరిశీలించగా.. అప్పటికే మృతి చెందినట్లు గుర్తించారు. మండలంలోని పోశెట్టిగూడ గ్రామానికి చెందిన కావాలి దర్శన్(48) గతంలో వీఆర్వోగా పని చేశాడు.
వీఆర్వో వ్యవస్థను రద్దు చేయడంతో సదరు వ్యక్తి రాచకొండ కమిషనరేట్ పరిధిలో అకౌంట్ సెక్షన్లో జూనియర్ అసిస్టెంట్‌గా పని చేస్తున్నాడు. శుక్రవారం విధులు ముగించుకొని ఇంటికి చేరుకున్న ఆయన తిరిగి ద్విచక్ర వాహనంపై శంషాబాద్‌కు వస్తూ శంషాబాద్ పట్టణంలోని ఫ్లైఓవర్‌ను రాంగ్రూట్లో ఎక్కుతుండగా హైదరాబాద్ వైపు నుంచి వస్తున్న కారు ఢీకొన్నది. ఈ ప్రమాదంలో దర్శన్ అక్కడికక్కడే మృతి చెందాడు. దర్శన్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నగరంలోని ఉస్మానియా దవాఖానకు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.