మూసాపేట, అక్టోబర్11: ఇద్దరి స్నేహితుల మధ్య డబ్బుల కోసం తలెత్తిన గొడవలో ఒకరు దారుణ హత్యకు గురయ్యాడు. కూకట్పల్లి సీఐ వెంకట సుబ్బారావు తెలిపిన వివరాల ప్రకారం శ్రీకాకుళం జిల్లా ఎర్ర మండలం జోగిపాడుకు చెందిన లుకాలపు దామోదర్(46) మూసాపేట ప్రగతినగర్‌లో నివాసం ఉంటున్నాడు. అదే ప్రాంతానికి చెందిన ఆకాశ్, సమీర్, మహ్మద్ మెహమూద్ లతో కలసి సెంట్రింగ్ పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు.
మెహమూద్‌కు దామోదర్ కొన్ని డబ్బులు బాకీ ఉన్నాడు. గురువారం రాత్రి ఈ నలుగురు మద్యం తాగారు. డబ్బుల విషయమై దామోదర్‌తో మెహమూద్‌కు గొడవ జరిగింది. మద్యం మత్తులో ఉన్న దామోదర్ మెహమూద్‌ను అసభ్యపదజాలంతో తిట్టడంతో ఆగ్రహానికి గురైన మెహమూద్ దామోదర్‌పై దాడి చేశాడు. దామోదర్ సీసీ రోడ్డుపై పడటంతో తలకు తీవ్ర గాయాలై అక్కడిక్కడే మృతి చెందాడు. మృతుడి సోదరి శ్యామల కుమారి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని రిమాండ్‌కు తరలించినట్లు తెలిపారు.