మూసాపేట, మార్చి 23: కాశీయాత్రలో విషాదం నెలకొంది. హైదరాబాద్‌లోని అల్లాపూర్ నుంచి కాశీ యాత్రకు బయల్దేరిన 12 మందిలో ఒకరు మృతి చెందగా.. 11 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ నెల 21న నాగపూర్‌లో జరిగిన ఈ ప్రమాదం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
వివరాల్లోకి వెళ్తే.. అల్లాపూర్ డివిజన్ పరిధి రామారావు నగర్‌కు చెందిన మల్లమ్మ(50) తన బంధువులతో కలిసి ఈ నెల 16న కాశీయాత్రకు రైలులో బయల్దేరింది. కాశీ యాత్ర ముగించుకుని ఈ నెల 21న హైదరాబాద్‌కు తిరుగు ప్రయాణమైంది. శనివారం నాడు ( ఈ నెల 21న) తెల్లవారుజామున సుమారు మూడు గంటల ప్రాంతంలో నాగపూర్ సమీపంలోని ఘాట్ రోడ్డు వద్ద ఆమె ప్రయాణిస్తున్న బస్సు అదుపుతప్పి లోయలో పడిపోయింది. దీంతో బస్సులో ప్రయాణిస్తున్న మల్లమ్మ అక్కడికక్కడే మరణించింది. మిగిలిన 11 మంది తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదం గురించి తెలుసుకున్న కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు.. నాగపూర్‌లోని అధికారులతో మాట్లాడి క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని కోరారు. మల్లమ్మ మృతదేహాన్ని హైదరాబాద్‌కు తీసుకొచ్చేందుకు కృషి చేస్తున్నామని పేర్కొన్నారు.