సిటీ బ్యూరో, నవంబర్ 27 (నమస్తే తెలంగాణ): తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి అధికారులను కలవాలంటే రోజుల తరబడి ఎదురు చూడాల్సిందే. సామాన్య ప్రజలు, పర్యావరణవేత్తలు, సామాజిక కార్యకర్తలు పీసీబీ అధికారులను కలవడం గొప్ప విషయంగా మారింది. ముఖ్యమంత్రి, మంత్రులు కూడా వీళ్లలా హై ప్రొఫైల్, ప్రొటోకాల్ మెయింటెన్ చేయడం లేదు. ఏ ప్రభుత్వ శాఖలోనైనా సంబంధిత అధికారులను కలిసి సమస్యలను వివరించడం, శాఖా పరమైన సమాచారం తీసుకోవడం సాధ్యమవుతున్నది. కానీ.. కాలుష్య నియంత్రణ మండలి అధికారులను కలిసేందుకు వీలు కావడంలేదని పలువురు పర్యావరణ వేత్తలు, ప్రజలు వాపోతున్నారు. స్వయం ప్రతిపత్తి కలిగిన బోర్డు కావడంతో అధికారులు నియంతల్లా వ్యవహరిస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
కాలుష్య నియంత్రణ మండలి సభ్య కార్యదర్శి దగ్గరకు వెళ్లడం సులభం అవుతుంది. కానీ బోర్డులోని అనలిస్ట్ స్థాయి అధికారి నుంచి సీనియర్ ఎన్విరాన్మెంటల్ సైంటిస్ట్ వరకు వారి వద్దకు వెళ్లాలంటే గంటలు, రోజుల తరబడి వేచిచూడ్సాలిన పరిస్థితి నెలకొన్నది. పరిశ్రమలు, కాలుష్యం, పర్యావరణం వంటి అంశాల్లో సంబంధిత సమాచారం తెలుసుకోవాలని పీసీబీ కార్యాలయానికి వెళ్తే ఏ అధికారిని కలవాలన్నా పెద్ద టాస్క్‌గా మారిపోయింది. పాలనా పరమైన, శాస్త్ర, సాంకేతిక పరమైన సమాచారం కావాలంటే ఆయా అధికారులు అపాయింట్ ఇవ్వడం లేదని తీవ్ర ఆరోపణలు వస్తున్నాయి. కానీ పారిశ్రామిక వేత్తలు, వారి ప్రతినిధులు వెళ్తే మాత్రం ఎదురుగా వచ్చి మరీ రాచ మర్యాదలు చేసి గంటల తరబడి మాట్లాడుతున్నారని సమాచారం.
అందుబాటులో ఉండని ఇన్చార్జి పీఆర్వో..
పీసీబీలో అనలిస్టు నుంచి సీనియర్ ఎనిర్వాన్‌మెంటల్ సైంటిస్టు దాకా నియంతల్లా వ్యవహిస్తున్నారు. ఈ పరిస్థితి మరే ప్రభుత్వ శాఖలో కనిపించదు. ఎవరిని ఏ పనిమీద కలవాలన్నా ముందుగా పీసీబీలో ప్రస్తుతమున్న ఇన్చార్జి పీఆర్వో దగ్గరకు వెళ్లి తాము వచ్చిన పనేమిటో చెప్పాలి. అప్పుడు ఆయన సంబంధిత అధికారికి సమాచారమివ్వాలి. ఆయన ఆ సమయంలో అందుబాటులో లేరని, ఏదో మీటింగ్‌లో ఉన్నారని, భోజన విరామం తర్వాత రావాలంటూ రకరకాల కారణాలు చెప్పి దాట వేస్తారు.
పరిశ్రమల్లో తనిఖీలు, కాలుష్యానికి సంబంధిన అంశాలైతే వారం రోజుల పాటు ఆగాల్సిందే. అన్ని రోజులు ఎదురు చూసినా చివరకు అరకొర సమాచారంతో వెనక్కి పంపిస్తున్నారని పర్యావరణవేత్తలు, బాధిత ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు తాము చేస్తున్న పని వివరాలు చెప్పటడానికి ఎందుకు ఇన్ని రకాల షరతులు, నిబంధులు పెడుతున్నారనే ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి. ప్రస్తుతమున్న ఇన్చార్జి పీఆర్వో తరచూ సమావేశాలు, ఈవెంట్ల పేరుతో పీసీబీలో అందుబాటులో ఉండటం లేదనే ఆరోపణలు వస్తున్నాయి.
పరిశ్రమల యజమానులకు వర్తించని నిబంధనలు..
సాధారణ పౌరులు, సామాజిక కార్యర్తలు, పర్యావరణ ప్రేమికులు, కాలుష్య బాధితులు పీసీబీ అధికారులను కలవడానికి రోజుల తరబడి సమయం పడుతుంది. ప్రొటోకాల్ పేరిట మూడు నాలుగు దశలు దాటుకొని సంబంధిత అధికారిని కలవాలి. అన్ని ఇబ్బందులు పడి ఆయన దగ్గరకు వెళ్లినా తమ దగ్గర ఏమీ లేదని చెప్పి పంపిస్తారు. కానీ.. ప్రజలకు హాని కలిగించే పరిశ్రమల యజమానులకు మాత్రం ఆ నిబంధనలు వర్తించడం లేదు. పరిశ్రమల యజమానులు అనుమతులు, శాఖా పరమైన పనుల కోసం వస్తే వారిని సాదరంగా ఆహ్వానిస్తున్నారు.
ఇన్చార్జి పీఆర్వో దగ్గరకు వెళ్లాల్సిన పనే లేకుండా అనలిస్టు నుంచి మెంబర్ సెక్రెటరీ దాకా నేరుగా వెళ్లి గంటల తరబడి చర్చలు జరుపుతారు. వారికి అధికారులు సైతం సకల మర్యాదలు చేస్తారు. కావలసిన పనులు చేసి పంపిస్తారని సామాజిక కార్యకర్తలు, పర్యావరణవేత్తలు ఆరోపిస్తున్నారు. కాలుష్య కారక బాధితులు, పర్యావరణ వేత్తలను చులకనగా చూస్తూ.. పరిశ్రమల నిర్వహకులకు మాత్ర రాచమర్యాదలు చేస్తున్నారని మండిపడుతున్నారు. కాలుష్య నియంత్రణ మండలి అధికారులు ఇప్పటికైనా కండ్లు తెరిచి ప్రజలు, ప్రభుత్వానికి సమన్వయ కర్తలుగా ఉండాలని కోరుతున్నారు. నియంతల్లా కాకుండా అన్ని ప్రభుత్వ శాఖల ఉద్యోగుల్లా వ్యవహరించాలని హితవు పలుకుతున్నారు.