బండ్లగూడ, మే 8: అతివేగం నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేసి వ్యక్తి మృతికి కారణమయ్యాడు. ఈ ఘటన రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఔటర్ రింగ్ రోడ్‌పై (ORR) చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం .. బుధవారం అర్ధరాత్రి ఓ కారు హిమాయత్ సాగర్ వద్ద బ్రేక్ డౌన్ అయింది. దీంతో ఆ కారు డ్రైవరు టోల్ సిబ్బందికి సమాచారం అందించారు. టోల్ సిబ్బంది రికవరీ వ్యాన్ తీసుకొని ఆ కార్ వద్దకు వెళ్లి కారు టైరు మారుస్తున్నారు. ఈ క్రమంలో వెనుకనుంచి అతివేగంగా వచ్చిన మరో కారు.. టైరు మారుస్తున్న శివకేశవ అనే వ్యక్తిని ఢీకొట్టింది.
దీంతో అమాంతం ఎగిరి కింద పడిన అతడు తీవ్రరక్తస్రావంతో అక్కడికక్కడే మృతి చెందాడు. మరో వ్యక్తి తీవ్రంగా గాయపడటంతో అతడిని దవాఖానకు దవాకాను తరలించారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని వివరాలను సేకరించారు. మితిమీరిన వేగమే ప్రమాదానికి కారణమై ఉండవచ్చని భావిస్తున్నారు. ఈ ఘటనలో మూడు కార్లు పూర్తిగా దెబ్బతిన్నాయని, ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.