సిటీబ్యూరో: తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా హైదరాబాద్ మహా నగర పరిధిలో బీఆర్ఎస్ శ్రేణులతో పాటు అభిమానులు తమ సంతోషంకొద్దీ నగరంతో పాటు శివారు ప్రాంతాల్లోనూ ఫ్లెక్సీలు, బ్యానర్లు కట్టడంతో పాటు పోస్టర్లు వేసుకొని తమ సంబురాన్ని చాటుకున్నారు. కేసీఆర్ ఫ్లెక్సీలు, పోస్టర్లను చూసి ఓర్వలేక సీఎంవో నుంచి అధికార యంత్రాంగానికి ఆదేశాల జారీ అయ్యాయి. అన్నింటినీ తొలగించాలని హుకూం జారీ కావడంతో ఆదివారం అర్ధరాత్రి నుంచే జీహెచ్ఎంసీ అధికారులు వాటిని తొలగించడం మొదలుపెట్టారు. చాలాచోట్ల పక్కనే కాంగ్రెస్ నేతల ఫ్లెక్సీలు, బ్యానర్లు ఉన్నా వాటి జోలికి మాత్రం వెళ్లలేదు. ముఖ్యమంత్రిగా తెలంగాణ అభివృద్ధికి పాటుపడిన కేసీఆర్ పుట్టినరోజు తమ అభిమానాన్ని చాటుకుంటే అది కూడా జీర్ణించుకోలేకపోవడం… అందుకోసం అధికారాన్ని దుర్వినియోగం చేసి ఏకపక్షంగా కేసీఆర్ ఫ్లెక్సీలు, బ్యానర్లు మాత్రమే తొలగించడంపై పెద్ద ఎత్తున విమర్శలు వినిపిస్తున్నాయి.
బీఆర్ఎస్ నేతల ఆగ్రహం
చిక్కడపల్లి: బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ, బ్యానర్లను తొలగించడాన్ని నిరసిస్తూ ఆర్టీసీ క్రాస్ రోడ్ వద్ద సోమవారం బీఆర్ఎస్ నేతలు ధర్నాకు దిగారు. బీఆర్ఎస్ యువ నాయకుడు ముఠా జై సింహ మాట్లాడుతూ రేవంత్ రెడ్డి సర్కార్ కేసీఆర్ ఫ్లెక్సీలు తొలగించినా.. ప్రజల గుండెల్లో కేసీఆర్ ఉన్నారన్నారు. అనంతరం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు.
మేడ్చల్ రూరల్: మేడ్చల్ మండలంలోని గౌడవెల్లి గ్రామంలో వృక్షార్చన కార్యక్రమానికి సంబంధించి మాజీ ఎంపీ సంతోష్‌కుమార్, మాజీ మంత్రి మల్లారెడ్డికి స్వాగతం పలుకుతూ ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. అయితే వేడుకలు ముగించుకొని మాజీ ఎంపీ సంతోష్‌కుమార్, మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి తిరిగి వెళ్లిన మరుక్షణమే గౌడవెల్లి చౌరస్తాలో ఉన్న ఫ్లెక్సీని మున్సిపల్ సిబ్బంది తీసివేస్తుండగా, బీఆర్ఎస్ నేతలు అడ్డు చెప్పారు. ఫ్లెక్సీలను తొలగించడం ఎంతవరకు సమంజమని ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే గుండ్ల పోచంపల్లి మున్సిపల్ పరిధిలో ఆదివారం రాత్రి నాలుగు ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. ఈ ఫ్లెక్సీలను సోమవారం ఉదయమే మున్సిపల్ సిబ్బంది తొలగించారు.
ప్రజల గుండెల్లోంచి తొలగించలేరు..
బడంగ్‌పేట: కేసీఆర్ ఫ్లెక్సీలను తొలగించినా..ప్రజల గుండెల్లో నుంచి తొలగించలేరని ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి అన్నారు. మీర్ పేట పరిధిలోని నూతనంగా ఏర్పాటు చేసిన ప్లే గ్రౌండ్, పెద్ద చెరువు, చందన చెరువు కట్టపైన కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఆమె మొక్కలు నాటారు.
మణికొండ: ఉద్యమ నేత కేసీఆర్‌ను ప్రజల గుండెల నుంచి తొలగించే దమ్ము ఎవరిక్గీ బీఆర్ఎస్ నేత కార్తిక్‌రెడ్డి అన్నారు. నియోజకవర్గ వ్యాప్తంగా సోమవారం కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను తొలగించడంపై ఆయన తీవ్రస్థాయిలో మండిపడ్డారు.