పేదలపై ప్రేమున్నది ఎవరికీ..! కాసుల కోసం, కమీషన్ల కోసం పేదలకు వైద్యమందించే దవాఖానలో నాసిరకం పనులు చేపట్టి అధికారులు చేతులు దులుపుకొంటున్నారు. మరమ్మతుల కోసమని కేటాయించిన సొమ్మును ఖర్చు పెడుతున్నట్లు చూపించి నాణ్యతలేని పనులకు శ్రీకారం చుట్టారు. పేదల పెద్దాసుపత్రిగా పేరొందిన గాంధీ జనరల్ ఆసుపత్రిలో అభివృద్ధి పేరుతో జరుగుతున్న పనుల్లో లీకేజీలు దర్శనమిస్తున్నాయి. వాటిని అరికట్టాల్సిన వారే నాసిరకం పనులకు వంతపాడుతుండటం గమనార్హం.
– సిటీబ్యూరో, జూలై 12(నమస్తే తెలంగాణ):
గాంధీ దవాఖానలో నెలకొన్న సమస్యలపై రోగులే అధికారుల దృష్టికి తీసుకుపోయారు. దీంతో ఆస్పత్రిలో నెలకొన్న సమస్యలను అధ్యయనం చేసిన డీఎంఈ, టీఎస్ఎంఐడీసీ..గాంధీ వైద్యశాలలో పాడైపోతున్న డ్రైనేజీ పైపులైన్ల మరమ్మతులు చేపట్టాలని, పాతవాటి స్థానంలో కొత్తవి సమకూర్చాలని ప్రతిపాదనలు సిద్ధం చేశారు. సుమారు రూ. 5కోట్ల వ్యయంతో ఈ మరమ్మతులు చేపట్టాలని నిర్ణయించారు.
అందులో భాగంగానే దవాఖానలోని డ్రైనేజీ పైపులైన్లు మార్చడం, దవాఖానకు పెయింటింగ్ వేయడం, డిపార్ట్మెంట్లకు సూచికలు ఏర్పాటు చేయడం, తాగునీటి సౌకర్యం కల్పించడం వంటి చర్యలు చేపట్టారు. అధికారులు పేపర్‌పై కొటేషన్లు చూపించారు కానీ, అమల్లో సరైన నాణ్యత చూపించడంలో పూర్తిస్థాయిలో విఫలమయ్యారు. ఇప్పటివరకు పూర్తయిన పనుల్లో పాడైపోయిన డ్రైనేజీ పైపుల్లో పూర్తిస్థాయిలో మార్చకుండా వదిలేశారు.
కొత్తవి మార్చాల్సిన అవసరం ఉన్నచోట కూడా మార్చకుండా వాటికి చిన్నచిన్న మరమ్మతులు చేసి బిగిస్తున్నారు. బిగించిన రెండు మూడు రోజులకే లీకేజీలను తలపిస్తున్నాయి. గోడలకు పెయింటింగ్ వేసినా కూడా లీకేజీ కారణంగా పై అంతస్తుల నుంచి వెలువడే డ్రైనేజీ నీళ్లు లీకవ్వడంతో గోడలన్నీ పాత తరహాలోనే దర్శనమిస్తున్నాయి. లీకైన పైపు కనెక్షన్లు కింది అంతస్తుల్లో రోగులుండే కిటికీల గుండా దుర్వాసనలు వస్తుండటంతో రోగులు కొత్త రోగాలను కొనితెచ్చుకుంటున్నారు.
పర్యవేక్షణ లేకనే…
1200 పడకల సామర్థ్యం గల గాంధీ దవాఖానకు వివిధ అనారోగ్య సమస్యలతో బాధపడుతూ చికిత్సకోసమని పేద, మధ్యతరగతి ప్రజలు వస్తుంటారు. చికిత్స పూర్తయి, రోగి కోలుకునే వరకు రోగితో పాటు సహాయకులు సైతం దవాఖానలోనే రోగితోపాటు ఉంటారు. ఈ తరహా నాణ్యతలేని పనుల వల్ల వైద్యం కోసం వచ్చిన రోగులు, వారి సహాయకులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇటీవల రెండు రోజులపాటు నీళ్లు నిలిచిపోవడంతో బయట నీళ్ల బాటిళ్లు కొనుక్కుని తెచ్చుకున్న విషయం తెలిసిందే.
ప్రస్తుతం నిర్వహిస్తున్న మరమ్మతులు ఎన్నిరోజులపాటు గ్యారెంటీ ఇ స్తాయో కూడా తెలియని పరిస్థితి నెలకొ ంది. గాంధీలో జరుగుతున్న మరమ్మతు పనుల గురించి టీఎస్ఎంఐడీసీ అధికారులు గానీ, దవాఖాన సిబ్బంది గానీ నిత్యం పర్యవేక్షణ లేకపోవడంతో నాసిరకం పనులు సాగుతున్నాయన్న వాదనలు వినిపిస్తున్నాయి. గోడల నుంచి కారే లీకేజీ నీళ్లు లోపల రోగులుండే రూముల్లోకి తుంపర్లుగా పడుతున్నాయని రోగులు ఆరోపిస్తున్నారు. గాంధీలో జరుగుతున్న మరమ్మతు పనులపై అధికారులు ప్రత్యేక దృష్టి సారి ంచి పనుల నాణ్యత పరీక్షించాలని రోగు లు, వారి బంధువులు వాపోతున్నారు.